HomeతెలంగాణTelangana BJP: తెలంగాణ బీజేపీలో ముసలం..

Telangana BJP: తెలంగాణ బీజేపీలో ముసలం..

Telangana BJP: తెలంగాణలో అధికా బీఆర్‌ఎస్‌కు దీటుగా, ప్రత్యామ్నాయంగా వేగంగా దూసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ.. కొన్ని రోజులుగా అంతే వేగంగా పడిపోతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరుగుతుండగా, అదే సంస్కృతిని అందిపుచ్చుకుని బీజేపీ గ్రాఫ్‌ పడిపోతోంది. క్రమశిక్షణకు మారుపేరు అయిన బీజేపీలో ఇప్పుడు తిరుగు బాట్లు.. పార్టీ లైన్‌ దాటి ప్రెస్‌మీట్‌ పెట్టడం.. బహిరంగంగానే అధిష్టానంపై వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలు, నేతలను పదవుల నుంచి తప్పించడం.. చేరికలను అడ్డుకోవడం వంటి చర్యలతో పార్టీని నేతలే పతనం వైపు నడిపిస్తున్నారు.

‘ఈటల’ సైలెంట్‌..
రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వరకూ కొనసాగిన అసంతృప్తి జ్వాలలు కొన్ని రోజులుగా చల్లారినట్లు కనిపించింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపు ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలో మళ్లీ ముసలం ప్రారంభమయింది. ఈటల రాజేందర్‌ పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. దీనికి కారణం పార్టీలో చేరికలే. అసలే చేరికలులేవు. చేరుతామని వచ్చే వాళ్లను రకరకాల కారణాలతో అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి కృష్ణయాదవ్‌ను బీజేపీలో చేర్చేందుకు ఈటల ప్రయత్నించారు. ఆయన అంగీకరించారు. బీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యం లేకపోవడం.. ఈటల అడిగారని కృష్ణ్ణయాదవ్‌ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అయితే పార్టీలో చేరే రోజున అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అడ్డుపడ్డారు. తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా కృష్ణయాదవ్‌ను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆపేశారు. దీంతో ఈటల ఇది తనకు జరిగిన అవమానంగా ఫీలయ్యారు.

తుల ఉమకు చెక్‌..
ఇక బీజేపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగరరావు కుమారుడిని కాషాయకండువా కప్పి కిషన్‌రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అక్కడ తుల ఉమకు వేములవాడ టిక్కెట్‌ ఇప్పిస్తాననే హామీతో ఈటల రాజేందర్‌ తనతోపాటు బీజేపీలోకి తెచ్చారు. తాను తెచ్చే వారిని చేర్చుకోకపోగా.. తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచే ప్రయత్నం చేయడంతో ఈటల చిన్నబుచ్చుకుంటున్నారు. మరో వైపు బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ నుంచి భారీ ఎత్తున చీలికలు తెచ్చి, నేతల్ని బీజేపీలోకి తెస్తారని ఆశించారు. అలాంటిదేం అక్కడ జరక్కపోవడంతో ఈటలపై పార్టీ పెద్దలు కూడా నమ్మకం కోల్పోతున్నారు.

భారీ చేరికలని ప్రచారం..
ఇటీవల ఖమ్మం సభలో 22 మంది బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు పార్టీలో చేరుతారని ప్రచారం చేశారు. కానీ.. ఒక్కరు కూడా చేరలేదు. దీంతో ఆయనకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జి.వివేక్, రవీంద్రనాయక్‌ వంటి నేతలమంతా కలిసి కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా యెన్నం శ్రీనివాసరెడ్డి గుడ్‌బై చెప్పారు. రఘునందన్‌రావు తాను పార్టీ మారబోనని పదేపదే చెప్పాల్సి వస్తోంది. పార్టీ నాయకత్వాన్ని మార్చిన తర్వాత బీజేపీ పరిస్థితి ఘోరంగా మారిందని ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version