Seethakka: సీతక్క.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పేరు సుపరిచితమే. ఈమె అసలు పేరు ధనసరి అనసూయ సీతక్క. సీతక్కగా అందరికీ ఈమె సుపరిచితం. 52 ఏళ్ల సీతక్క జీవిత తెరిచిన పుస్తకం.. రెండు 15 ఏళ్లు మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన సీతక్క.. ఉద్యమంలో ఉన్నప్పుడే శ్రీరాముని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. నందమూరి తారకరామారావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు వనం వీడి జనంలోకి వచ్చారు. తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌లో రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నియమితులయ్యారు.
సీతక్క జర్నీ..
సీతక్క వరంగల్ జిల్లా, ములుగు మండలం జగన్నపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో 1971 జూలై 9న జన్మించింది. సమయ్య, సమ్మక్క దంపతులకు సీతక్క రెండో సంతానం. సీతక్క పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంది. ప్రజా సమస్యలపై స్పందించే గుణం సీతక్కకు చిన్నతనం నుంచే అలవరింది. ప్రజలపై జరుగుతున్న అనేక అన్యాయాలపై చదువుతున్న రోజుల్లోనే ప్రశ్నించేది. తదనంతర కాలంలో ఆదీవాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలకు రగిలిపోయి పోరాటం చేయాలనే ఉద్దేశంతో 1988లో నక్సల్ పార్టీలో చేరారు. 15 ఏళ్లు మావోయిస్టుగా ప్రజాసమస్యలపై పోరాటం చేశారు. ఉద్యమంలో ఉండగానే తన బావ శ్రీరాముడిని వివాహం చేసుకుని తన పేరును సీతక్కగా మార్చుకున్నారు.
ఎన్టీఆర్ పిలుపు మేరకు..
దరాబ్దంనరపాటు మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన సీతక్కకు ఒక కొడుకు. భర్త శ్రీరాము మరణించాడు. ఈ క్రమంలో 1994 ముఖ్యమంత్రి అయిన నందమూరి తారకరామారావు మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. 1997లో జనజీవన స్రవంతిలో కలిసిపోయే మావోయిస్టులకు ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. దీంతో సీతక్క అడవి బాట వీడారు. పోలీసులకు లొంగిపోయారు.
న్యాయవాద విద్య..
జనజీవన స్రవంతిలో కలిసిన సీతక్క 2001లో హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బీ చదివింది. చట్టం అధ్యయనం చేసిన తర్వాతే ఆమెకు ప్రజావిధానం, పాలనపై ఆసక్తి ఏర్పడింది. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన సీతక్క పీహెచ్‌డీ కూడా చేశారు. సీతక్క సామాజిక సేవలో చురుకుగా ఉండి, స్థానికంగా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. సీతక్క ప్రజాసేవను గుర్తించిన అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి ఆహ్వానించారు. దీంతో టీడీపీలో చేరారు సీతక్క. రాజకీయాల్లో ఉంటూ తన చదువును కొనసాగించారు సీతక్క. 2022లో పొలిటికల్ సై¯Œ ్స సబ్జెక్టులో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.
2004 ఎన్నికల్లో పోటీ..
చేరిన సీతక్క.. 2004లో ములుగు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో మళ్లీ టీడీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున పోటీ చేశారు. కానీ టీఆర్‌ఎస్ అభ్యర్థి చందూలాల్ చేతిలో ఓడిపోయారు. 2017లో రేవంత్‌రెడ్డితో కలిసి సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో ములుగు నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
కరోనా సమయంలో ఆదివాసీలకు అండగా..
2019 చివర్లో వచ్చిన కరోనా సమయంలో సీతక్క మారుమూల పల్లెకి కూడా వెళ్లి ఆహార పదార్థాలు ఇచ్చేవారు. ఈ ఏడాది జూలైలో తెలంగాణని ముంచెత్తిన వానకి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కొండాయి గ్రామమంతా వరద నీటితో మునిగిపోయింది. సీతక్క చూడలేకపోయారు. ఈ గ్రామ ప్రజలను రక్షించడానికి హెలికాప్టర్ పంపాలని కన్నీరు పెట్టుకున్నారు.
వరించిన మంత్రి పదవి..
తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున ములుగు నుంచి బరిలో నిలిచారు. సీతక్కను ఓడించేందుకు అధికార బీఆర్‌ఎస్ అనేక ప్రయత్నాలు చేసింది. కేటీఆర్ అయితే స్వయంగా సీతక్కను ఓడిస్తామని ప్రకటించారు. కానీ, ఆమె చేసిన సేవకు ఆదివాసీలు అండగా నిలిచి మరోమారు అక్కున చేర్చుకుని అసెంబ్లీకి పంపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీతక్కను మంత్రి పదవి వరించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.