Bhu Bharati: రాష్ట్రంలో రెవెన్యూ శాఖ ‘సమీకృత భూభారతి’ అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను రంగంలోకి దించుతోంది. ఈ దెబ్బతో ఇకపై భూమి హద్దుల కోసం, సర్వే నంబర్ల కోసం తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే ‘ఆరోగ్యకరమైన వ్యాయామం’ రైతులకు దూరం కానుంది. సర్వేయర్ ఎప్పుడు వస్తాడో తెలియక ఆయన కోసం చెట్టు కింద గంటల తరబడి ఎదురుచూస్తూ పలకరించుకునే ‘సోషల్ నెట్‌వర్కింగ్’ ముగిసిపోనుందని కొందరు రైతులు సరదాగా వాపోతున్నారు.
Also Read: రెండో ప్రపంచ యుద్దం నుంచి ఫ్రెండ్.. ఇప్పుడు అమెరికాకు ఇచ్చి పడేసిన మిత్ర దేశం
ఆ ‘గోల్డెన్ డేస్’ ఇక రావు!
గతంలో సర్వే కావాలంటే ఒక అప్లికేషన్ ఇచ్చి, సర్వేయర్ గారి ‘మూడ్’ బాగున్న రోజు కోసం వేచి చూడటం ఒక అడ్వెంచర్ లా ఉండేది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తీసి క్లిక్ చేస్తే చాలు.. రోవర్లు పట్టుకుని వస్తారట. గొలుసులు పట్టుకుని అడుగులు వేసే పాత కాలపు మనుషుల కంటే, ఈ మెషిన్లే నయం అని సర్కారు నమ్ముతోంది. రోవర్ల వల్ల సర్వే ఖచ్చితంగా వస్తుందట.. అంటే ఇక పక్క రైతుతో ‘ఒక అడుగు నాది.. అర అడుగు నీది’ అని గొడవపడి కోర్టుల చుట్టూ తిరిగే అద్భుతమైన అవకాశం కూడా పోయేలా ఉంది!
భూధార్ కార్డు.. మనిషికో నంబర్, మట్టికో నంబర్!
మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్టే, ఇప్పుడు ప్రతి మట్టి గడ్డకూ ‘భూధార్’ నంబర్ కేటాయిస్తారట. దీంతో భూమికి కూడా ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది. పాపం, ఇంతకాలం సర్వే నంబర్లను అడ్డం పెట్టుకుని ఇద్దరు ముగ్గురికి ఒకే భూమిని అమ్మి ‘బిజినెస్’ చేసుకున్న ఘనుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యాప్ ఉండాలనే రూల్ పెట్టి, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ‘డాక్యుమెంట్ రైటర్ల’ సృజనాత్మకతకు మంత్రి గండి కొట్టారు.
ఎస్ఎంఎస్ అలర్ట్స్.. నిద్ర పట్టనివ్వవు!
అప్లికేషన్ ఎక్కడ ఉందో అని కంగారు పడకుండా, ప్రతి స్టెప్పులో మొబైల్‌కు మెసేజ్‌లు పంపిస్తారట. అధికారులు ఫైలును పక్కన పడేసే ఛాన్స్ లేకుండా ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మంటూ మోగుతుంటే, రెవెన్యూ సిబ్బందికి కూడా ఇక ‘రిలాక్స్’ అయ్యే టైమ్ ఉండదు కాబోలు. మొత్తానికి మంత్రి పొంగులేటి గారు వేసిన ఈ ‘తొలి అడుగు’.. దళారుల ‘ఆఖరి అడుగు’ అవుతుందో లేదో చూడాలి!
