Indiramma Indlu: పేదలకు సొంత ఇల్లు కల్పించాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతోమందికి ఉపయోగపడుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఈ పథకాన్ని ఇప్పటివరకు గ్రామాల్లో అమలు చేశామని.. ఇకనుంచి పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తాజాగా ప్రకటించారు. పట్టణాల్లోనూ నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. అయితే పట్టణాల్లో స్థలం లేని వారికి జి + టు (గ్రౌండ్ ప్లస్ టు) గృహాలు నిర్మించి ఇస్తామని ఆయన తాజాగా ప్రకటించారు. అయితే పట్టణ ప్రాంతాల్లో భూమి కొరత ఉన్న కారణంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పేదల కోసం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసి నిర్మించామని.. త్వరలోనే మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని.. నాణ్యమైన మెటీరియల్ వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా తాగునీరు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక సదుపాయాలను కూడా ఆయా ప్రాంతాల్లో వేసేందుకు ప్రణాళికలు వేస్తున్నామని అన్నారు. పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళను నిర్మిస్తూ వస్తుంది. ఇప్పటికే చాలామంది గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించుకున్నారు. వీరికి బిల్లులు కూడా సక్రమంగా మంజూరు అవుతున్నట్లు తెలుపుతున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ఎక్కువ మొత్తంలో ఇల్లు నిర్మిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలుపుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇసుకను పొందేందుకు ఇటీవల ప్రత్యేకంగా యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఇందిరమ్మ ఇల్లు నిర్మించే వారికి ప్రత్యేకంగా ఆప్షను కూడా ఏర్పాటు చేసింది.
అన్ని వర్గాల సంక్షేమమే ప్రధానంగా వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లా నిర్మాణంలో మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటుంది. ఇప్పటికే చాలావరకు ఇల్లు నిర్మించినప్పటికీ… రెండో విడత కూడా మంజూరు చేస్తున్నట్లు ఇటీవల మంత్రులు ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా పట్టణాల్లోనూ నిరుపేదలకు ఇల్లు అందించేలా ప్రణాళికలు వేస్తున్నారు. స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంతోపాటు ఎలాంటి స్థలం లేని వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
