KTR under SIT probe: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు జరిగిందన్నట్టుగా భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఇప్పుడు ఈ కేసులో గురువారం మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈసారి ప్రత్యేక దర్యాప్తు బృందం మాజీమంత్రి, భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు నోటీసులు అందించింది. అంతేకాదు, శుక్రవారం నిర్వహించే విచారణకు హాజరుకావాలని ఆయనకు అందించిన నోటీసులలో ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది.
ఇప్పటికే ఈ కేసులో చాలామందిని ప్రత్యేక దర్యాప్ బృందం విచారించింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కీలకంగా పని చేసిన పోలీసు అధికారులను అరెస్టు చేసింది. వారి దగ్గర నుంచి కీలకమైన వాంగ్మూలాలు సేకరించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన కొంతమంది పోలీసు అధికారులు హార్డ్ డిస్క్ లు దగ్ధం చేశారు. కీలకమైన ఆధారాలను లభించకుండా చేశారు. కొన్ని ఫైళ్లను కాల్చేసినట్టు ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఫోన్ టాపింగ్ కేసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది.. ఆ తర్వాత అనేక దఫాలుగా ఈ కేసును విచారిస్తోంది.
ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. గంటల తరబడి ఈ విచారణ సాగింది. ఆ తర్వాత హరీష్ రావు కుమారుడు అమెరికా వెళుతున్న నేపథ్యంలో ఆయనను కాస్త ముందుగానే విచారణ నుంచి బయటికి పంపించారని తెలుస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత అటు హరీష్ రావు.. ఇటు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు పరస్పరం విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. మరోవైపు గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన భర్త ఫోన్ కూడా చాటుగా విన్నారని కవిత ఆ మధ్య ఆరోపణలు చేయడం విశేషం. తన భర్త మాట్లాడిన మాటలను వినాల్సిన అవసరం ఏముందని కవిత ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డ భర్త ఫోన్ ట్యాప్ చేయడం ఎంతవరకు సమంజసం అని కవిత ఆరోపించారు.
ఇప్పుడు కేటీఆర్ ను విచారణకు పిలిచిన నేపథ్యంలో.. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఆయనను ఏ తరహా ప్రశ్నలు అడుగుతారు.. దానికి కేటీఆర్ ఎలాంటి సమాధానం చెబుతారు.. అనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సాగుతోంది. ఇటీవల హరీష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు పిలిచినప్పుడు ఆయన వెంట కేటీఆర్ ఉన్నారు. విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు కేటీఆర్ వంతు రావడంతో గులాబీ పార్టీ మరింత రెచ్చిపోవడం ఖాయం. జిల్లాల వారీగా పార్టీ నాయకులు విలేకరుల సమావేశాలు పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ కేసులో త్వరగా నిందితులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.