Jagan Padayatra: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతోంది. రెండేళ్లు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా పర్యటనలకు సిద్ధపడుతున్నారు. పాదయాత్రకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సహజంగానే ప్రతిపక్షాల్లో ఉన్నవారికి పాదయాత్రలు కలిసి వస్తున్నాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో పాదయాత్రకు సిద్ధపడుతున్నారు జగన్. కానీ ఈయన గతంలో కూడా పాదయాత్ర చేశారు. రెండోసారి పాదయాత్ర చేసి అధికారాన్ని అందుకోవాలని చూస్తున్నారు. కానీ ఇంతలో ఏపీలో సంచలనాలు నమోదు అవుతాయని బిజెపి రాష్ట్ర చీఫ్ మాధవ్ తేల్చి చెప్తున్నారు. దీంతో అందరిచూపు జగన్మోహన్ రెడ్డి వైపే ఉంది. పాత కేసుల్లో ఆయన అరెస్ట్ అవుతారా అనే అనుమానాలు కూడా రేగుతున్నాయి. అయితే బిజెపి నుంచి వచ్చిన ఈ ప్రకటనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన ఉంది.
ప్రజల్లోకి వచ్చింది తక్కువే..
వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పాదయాత్రకు సిద్ధపడుతున్నారు నిజమే. కానీ ప్రజా పోరాటాలకు ఆయన ముందుకు రావడం లేదు. జిల్లాల పర్యటన అంటూ గత సంక్రాంతి ముందు చెప్పారు. ఏడాది కాలయాపన చేశారు. ఇప్పుడు మరోసారి జిల్లాల పర్యటన అంటున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం లో వారానికి నాలుగు రోజులపాటు పర్యటన ఉంటుందని చెబుతున్నారు. ఆ నాలుగు రోజులపాటు ఆ పార్లమెంటరీ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గం వర్గాల రివ్యూ జరుపుతారు. అవసరం అనుకుంటే నాయకత్వాన్ని మార్చేందుకు కూడా సిద్ధపడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే నియోజకవర్గాల్లో నాయకత్వాల మార్పు ఆ పార్టీ శ్రేణులను చికాకు తెచ్చిపెడుతున్నాయి. పైగా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలకి అధిక ప్రాధాన్యమిస్తున్నారని.. పార్టీ కోసం ఖర్చు చేసే వారికి టిక్కెట్ల కేటాయింపు అనేది పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన విమర్శకు కారణమవుతోంది.
రెండోసారి కావడంతో..
పైగా పాదయాత్ర అనేది రెండేళ్ల ముందు నుంచే ప్రారంభించాలి. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఏడాదిన్నర ముందు చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. 2029 మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అంటే ఆయన 2028 ద్వితీయార్థంలో పాదయాత్రకు బయలుదేరుతానని చెబుతున్నారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చింది తక్కువ. కేవలం కేసులు ఎదుర్కొనే వైసీపీ నేతలను పరామర్శించేందుకు.. పార్టీకి చెందిన నేతలు చనిపోయినప్పుడు ఆ కుటుంబాల పరామర్శకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి వెళుతున్నారు. ఒకవేళ పార్టీ శ్రేణులకు ఏదైనా అంశంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చిన సమయంలో ఆయన బెంగుళూరులో కనిపిస్తున్నారు. ఇలా ప్రజల్లోకి రాకుండా.. రాజకీయాలు చేస్తామంటే కుదిరే పని కాదు. పైగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చూశారు ఏపీ ప్రజలు. అంతకుమించి పాలనను కూడా చూశారు. ఇప్పుడు రెండోసారి పాదయాత్ర చేసి.. మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన పాదయాత్రను చూసిన ప్రజలకు.. పాలనలో అనేక వైఫల్యాలు కనిపించాయి. అందుకే ఇప్పుడు ఏం చెప్పుకొని పాదయాత్ర చేస్తారు అనేది ఒక ప్రశ్న. సంక్షేమం ఇచ్చారు కానీ అభివృద్ధి జరగలేదన్నది ఆయన పై ఉన్న విమర్శ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మునుపటి మాదిరిగా ఉండదు అనేది ఒక విశ్లేషణ. చూడాలి ఈ విషయంలో ఏం జరుగుతుందో?