HomeతెలంగాణVakil Saab" scene : బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో.. "వకీల్‌ సాబ్‌" సీన్! ఈ ఖాకీ...

Vakil Saab” scene : బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో.. “వకీల్‌ సాబ్‌” సీన్! ఈ ఖాకీ తెలివి ఆ రేంజ్ లో ఉంది మరి!

Vakil Saab” scene : పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌ సాబ్‌’లో.. కోర్టు సీన్‌ సినిమా మొత్తానికే హైలైట్‌..! కోర్టులో వాదనల సమయంలో న్యాయవాదిగా ఉన్న హీరో.. మహిళా పోలీస్‌ అధికారి మధ్య జరిగిన సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. ప్రేక్షకులను రక్తికట్టించిన అలాంటి సన్నివేశాలే.. బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో 4 రోజుల క్రితం జరిగిన ఏసీబీ దాడుల కేసులోనూ వెలుగులోకి వచ్చాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని రాక్‌క్లబ్‌ స్కై లాంజ్‌ పబ్‌లో జూలై 30న అర్ధరాత్రి ఎస్సై నవీన్‌ రెడ్డి నేతృత్వంలో దాడి జరిగినట్లు రికార్డుల్లో ఎంట్రీ చేశారు. అసలు విషయం ఏమిటంటే ఆ రోజు ఎస్సై నవీన్‌ రెడ్డి డ్యూటీలోనే లేరని ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలను సేకరించారు. కానీ.. ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ మాత్రం.. జూలై 30 అర్ధరాత్రి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టినట్లు కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. నిజానికి ఆయన జూలై 30న సాయంత్రం 7.30కే ఠాణా నుంచి వెళ్లిపోయినట్లు సాంకేతిక ఆధారాలున్నాయి. కోర్టుకు కేవలం చార్జ్‌షీట్‌ మాత్రమే సమర్పించారని, పంచనామా కాపీలు, పంచనామా చేసిన వారి స్టేట్‌మెంట్‌ లేవని ఏసీబీ నిగ్గుతేల్చింది. ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే.. అసలు ఆ రోజు పబ్‌లో పోలీసు దాడులే జరగలేదని తేలింది. ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే.. పబ్‌ యజమాని లక్ష్మణరావు, మరొకరి స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసినట్లు పోలీసులు చెబుతున్నా.. వారిద్దరూ ఆ రోజు, పోలీసులు చెప్పిన సమయంలో పబ్‌లోనే లేరని ఏసీబీ నిగ్గుతేల్చింది.

రాక్‌క్లబ్‌ స్కై లాంజ్‌ పబ్‌ రెండో అంతస్తులో కొనసాగుతుండగా.. దాని కింద మరో పబ్‌ ఉంది. ఆ పబ్‌లో పోలీసు అధికారి బంధువొకరు స్లీపింగ్‌ పార్ట్‌నర్‌గా ఉన్నారు. కింద ఉన్న పబ్‌లో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని పై పబ్‌ వారు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు మాత్రం ఫిర్యాదుదారుపైనే ఉల్టా కేసు బనాయించారు. ఈ రెండు పబ్‌ల మధ్య వివాదానికి కారణం పార్కింగ్‌ స్థలమే. పార్కింగ్‌ ప్రదేశం కోసం ఫిర్యాదుదారుడు నెలకు రూ.50 వేల అద్దె చెల్లిస్తుండగా.. పోలీసు బంధువు పార్ట్‌నర్‌గా ఉన్న పబ్‌ వాళ్లు ఆ స్థలంలో తమ కస్టమర్లతో అడ్డదిడ్డంగా వాహనాలను పార్క్‌ చేయించేవారు. ఇక్కడే రెండు పబ్‌ల యజమానులకు వివాదం మొదలైంది. పోలీసులు మాత్రం ఫిర్యాదుదారుపైనే కేసు పెట్టి.. కింది పబ్‌ వారికి వత్తాసు పలికారు. అంతేకాదు.. బాధితుడికి ఇన్‌స్పెక్టర్‌ నుంచి వేధింపులు పెరిగాయి. దాంతో బాధితుడి తరఫున ఐపీఎస్ లు రంగంలోకి దిగి చెప్పినా.. ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ వెనక్కి తగ్గకపోవడం గమనార్హం..! చివరకు గత్యంతరం లేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ రంగంలోకి దిగడంతో.. ఇన్‌స్పెక్టర్‌ తనను కాపాడాలంటూ తన అనుచరులను రంగంలోకి దింపారు. అయితే.. ఏసీబీ మాత్రం ఇన్‌స్పెక్టర్‌కు వ్యతిరేకంగా సాంకేతిక ఆధారాలను సైతం సేకరించి, 20 పేజీల పంచనామా నివేదికను రూపొందించింది. ఆ వివరాలతో కూడిన నివేదికను హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌కు అందజేసింది.

కాగా, ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ చెప్పారంటూ లంచం డబ్బుల కోసం హోంగార్డు హరి రోజూ పబ్‌ యజమానికి వాట్సాప్‌ ఫోన్‌చేసి వేధించేవాడని ఏసీబీ గుర్తించింది. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడని తెలుసుకున్న హరి.. తన ఫోన్‌ను, సిమ్‌కార్డును మార్చేశాడు. ఇన్‌స్పెక్టర్‌కు కలెక్టర్‌(లంచాలు వసూలు చేయడం)గా పలు కేసుల్లో డబ్బు వసూళ్ల వెనక హరి ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ తేల్చింది. హరి పాత ఫోన్‌లో డేటాను సైబర్‌ ఫోరెన్సిక్‌ ద్వారా ఏసీబీ అధికారులు సైబర్‌ ల్యాబ్‌లో రిట్రీవ్‌ చేస్తున్నారు. కాగా.. ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌, ఎస్సై నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిని ఏసీబీ అధికారులు గత సోమవారం విచారించారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version