Rain Alert: నెల రోజులుగా పెరుగుతున్న ఎండలు.. మండుతున్న భానుడితో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
6వ తేదీ వరకు పొడి వాతావరణం..
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తెలంగాణలో ఏప్రిల్ 6వ తేదీ వరకూ పొడి వాతావరణం ఉంటుంది. ఈనెల 7, 8వ తేదీల్లో తావావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. పలు ప్రాంతాల్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
ఒకవైపు భానుడు భగ్గుమంటున్నాడు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మధ్యాహ్నం వేళలో బయటకు రావొద్దని సూచించింది. పనులు ఉంటే ఉదయం 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల తర్వాత చేసుకోవాలని పేర్కొంది.
జూన్ వరకు ఎల్‌నినో..
ఇదిలా ఉండగా ప్రస్తుత వేడికి ఎల్‌నినో ప్రభావమే కారణమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ఈసారి మార్చి, ఏప్రిల్ నెలల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంటున్నారు. ఎల్‌నినో ప్రభావం వచ్చే జూన్ వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నట్లు అంచనా వేస్తున్నారు.