Telangana: పది రోజులుగా తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ఆదివారం సాయంత్రం కాస్త చల్లబడింది. ఈమేరకు వాతావరణ శాఖ కూడా చల్లని కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడతాయని పేర్కొంది.
ఎండలుతోపాటే..
వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పినప్పటికీ ఎండలు కూడా కొనసాగుతాయని వెల్లడించింది. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చాలా జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈమేరకు కొన్ని జిల్లాలకు ఆరంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఇక ఆదివారం ఖమ్మం, కొత్తగూడెం, సూర్యపేట, నాగర్ కర్నూల్, వరంగల్ జిల్లాల్లో వర్షం కురిసింది. సోమవారం భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెం, ఖమ్మం, నల్లొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.
ఈ జిల్లాల్లో వేడిగాలులు..
ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వేడిగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురస్తాయని వెల్లడిచింది. కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధ, గురువారాల్లో కూడా చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిచింది.
పెరుగుతున్న వడదెబ్బ మరణాలు..
ఇదిలా ఉండగా భగ్గుమంటున్న భానుడి వేడి తాళలేక వడదెబ్బతో రాష్ట్రంలో మరణాలు పెరుగుతున్నాయి. శనివారం వివిధ జిల్లాల్లో 19 మంది మృతిచెందారు. రాష్ట్రమంతటా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం కూడా పది మందికిపైగా మృత్యువాతపడ్డారు. మరోవైపు రాష్ట్రంతో గాలిలో తేమశాతం పడిపోతోంది. దీనివలన ఉష్ణతాపం ఎక్కువగా అనిపిస్తుంది. గాలిలో తేమ 50 శాతం కన్నా తక్కువగా నమోదవుతుంది.