KCR And Jagan Accept Defeat: రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవద్దు.. గెలిచినప్పుడు పొంగిపోవద్దు అని అంటుంటారు. గెలిచినా ఓడినా ఎప్పుడూ ఒకేలా ఉండడమే రాజకీయ నాయకుడి లక్షణం. కానీ.. మొన్నటి ఎన్నికల్లో చేదు ఫలితాలు చవిచూసిన ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు తమ ఓటములను జీర్ణించుకోలేకోతున్నారు. ఓటమిని ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు. ఏ రాజకీయ పార్టీ కూడా అంచనా వేయలేదు. అంతెందుకు ఈ మధ్య ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం తప్పాయి. ఫలానా పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తే.. ఫలితాల్లో రివర్స్ అయింది. అపోజిట్‌లో ఉన్న పార్టీ గెలుపొందింది. అయితే.. రాజకీయాల్లో ఎప్పుడైనా పడిలేచే కెరటాల్లాగే భావించి ప్రజాతీర్పును గౌరవించాలి. అలాకాకుండా కేవలం గెలుపును మాత్రమే తీసుకుంటామంటే అలాంటి నేతలకు భవిష్యత్ ఉంటుందనేది కూడా అనుమానమే.
ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ విషయంలోనూ ఇదే కనిపిస్తోంది. ప్రజలు ఆదరించినన్ని రోజులు వీరు అధికారంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉంది. ఓ ఐదేళ్లు వైసీపీ ఏపీలో అధికారం చేపట్టింది. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రత్యర్థి పార్టీలను హీనంగా చూశారనే అపవాదు ఉంది. ప్రత్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టలేనంతగా వారిపై వ్యక్తిగత దూషణలకూ దిగారు. ఇక.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో బాబు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. ఓటమిని బరువుగా భావించకుండా.. బాధ్యతగా భావించి ఆయన అసెంబ్లీకి కూడా వెళ్లారు. అయితే.. అప్పుడు గెలిచిన అహంతో వైసీపీ చంద్రబాబును అగౌరవ పరుస్తూ చట్టసభలకు రాకుండా చేసింది. 151 మంది ఎమ్మెల్యేలను వెంటేసుకొని జగన్ సైతం వ్యక్తిగత దూషణలకు తెగబడుతూ అసెంబ్లీని ఒక టూరిస్టు ప్లేసులా మార్చారన్న వాదన ఉంది. గత ఎన్నికల్లో జగన్ ఓటమిని చూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఓటమి ఎదురుకావడంతో అదే అసెంబ్లీ గేట్లు తాకడానికి కూడా ఇప్పుడు జగన్ భయపడిపోతున్నాడు. అందుకే.. నిత్యం మీడియా ముందు వచ్చి టైం పాస్ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక.. తెలంగాణకు వచ్చే సరికి దశాబ్దాల కాలంగా కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కేసీఆర్‌కు తిరుగులేకుండా పోయింది. రాజకీయాల్లో ఆయనను ఢీకొనే వారు లేకుండాపోయారు. దాంతో ఎప్పటికీ ఆయనకు ఓటమి అనే ఎదురుకాలేదు. ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓటమిని చవిచూడలేదు. అలాగే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా ప్రజలు కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే.. రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారు. అయితే.. అనూహ్యంగా గత ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమిని ఎదుర్కొంది. ప్రతిపక్ష నేతగా అధ్యక్షా అంటూ అసెంబ్లీకి వెళ్లాల్సిన కేసీఆర్ ముఖం చాటేస్తున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వనంటూ శపథం చేశారు. ఇందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ నాయకులు రేవంత్ ఎదుట పడలేక అసెంబ్లీకి రావడానికి జంకుతున్నారు. దీంతో ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను ఉద్దేశించి రాజకీయ విశ్లేషకులు పలు ప్రశ్నలను సంధిస్తూనే ఉన్నారు. మీకు గెలుపు మాత్రమే అవసరమా..? ఓటమిని ఎందుకు అంగీకరించరు..? అంటూ నిలదీస్తున్నారు. ఓటమిని, గెలుపును రెండింటినీ ఒకేలా తీసుకోవాలని సూచిస్తున్నారు.