Congress 6 Guarantees: తెలంగాణలో పథకాల సందడి మొదలైంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే కొన్ని గ్యారంటీలు అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27న రూ.500లకే ఎల్పీజీ గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. మరోవైపు ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల్లో ఒకటి బైక్ ఉంటే రాదట. అదేంటో తెలుసుకుందాం.
ఆరు గ్యారంటీలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమను గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేసే ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అందులో కీలకమైనవి ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం, విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు రుణ కార్డులు తదితరాలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే అంటే డిసెంబర్ 9న సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి అమలు చేశారు.
27న మరో రెండు హామీలు..
ఇక ఫిబ్రవరి 27 నుంచి మరో రెండు హామీల అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. ప్రియాంకగాంధీ చేతుల మీదుగా వీటిని ప్రారంభిస్తారు. రేషన్ కార్డు ఉన్నవారికే ఇవి వర్తిస్తాయి.
మిగతా హామీలపై చర్చ..
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ఇచ్చిన కీలక హామీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఒకటి. దీనికి సబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ పథకానికి 82,82,323 మంది అభయహస్తం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాల్లో 4,16,500 మందికి ఇళ్లు నిర్మించనున్నట్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు బడ్జెట్‌లోరూ.7,740 కోట్లు కేటాయించింది. అయితే ఇళ్ల లక్ష్యానికి, బడ్జెట్‌కు పొందన లేదు. 4.16 లక్షల ఇళ్లకు రూ.20,825 కోట్లు కావాలి, కానీ బడ్జెట్‌లో 7,740 కోట్లు మాత్రమే కేటాయించారు.
లబ్ధిదారుల సంఖ్య తగ్గింపు..
బడ్జెట్‌లో పెట్టిన నిధుల మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను తగ్గించేందుకు ప్రభుత్వ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న కారు, ద్విచక్రవామనం ఉన్నవారిని ఈ పథకానికి అనర్హులుగా పరిగణించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంత కరెంటు వాడుతున్నారు, ఏసీ, వాషింగ్ మిషీన్ ఉందా అని కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. అభయహస్తం దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితిని తెలుసుకునేందుకు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. అన్ని వివరాలు తెలుసుకున్నాక లబ్ధిదారులను ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది.