https://oktelugu.com/

BJP-BRS : బీజేపీ ఫెయిల్ అయ్యేది.. బీఆర్ఎస్ పాస్ అయ్యేది ఇక్కడే

బీజేపీ మాత్రం రివర్స్‌లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రైతు ఉద్యమాలను బీఆర్ఎస్ పార్టీ పక్కన పెడితే ‘పాత చింతకాయ పచ్చడి’లా.. బీఆర్ఎస్ ఎప్పుడో వదిలేసిన రుణమాఫీ అంశాన్ని ఇప్పుడు భుజాన వేసుకుంది. నేడు రైతు దీక్షకు దిగింది. దీంతో పార్టీలోని సీనియర్ల నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వదిలేసిన అస్త్రాలను పట్టుకొని రాజకీయం చేయడం ఏంటని అసహనం చేస్తున్నారని తెలిసింది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 30, 2024 / 07:55 PM IST

    BJP-BRS

    Follow us on

    BJP-BRS :  తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో హైడ్రా చుట్టూనే రాజకీయాలు కొనసాగుతున్నాయి. ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దోషిగా నిలబెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. కానీ.. ఇదే సమయంలో బీజేపీ వైఖరి మాత్రం చర్చకు దారితీసింది. గతంలో బీఆర్ఎస్ ఎత్తుకొని వదిలేసిన అంశాన్ని బీజేపీ భుజాన వేసుకుంది.

    రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు హైడ్రా మీదే పంచాయితీ కొనసాగుతోంది. కానీ ఈ అంశాన్ని క్యాష్ చేసుకోవడంలో బీజేపీ మాత్రం ఫెయిల్ అయినట్లుగానే అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల వేళ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. దానిపై వరంగల్ సభా వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించారు. అంతవరకు బాగానే ఉన్నా.. అధికారంలోకి వచ్చాక ఆరు నెలల తరువాత కాంగ్రెస్ రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. చెప్పినట్లుగా ముందు లక్ష ఆ తరువాత లక్షన్నర, ఆ తరువాత రెండు లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసింది. కానీ.. అందులోనూ లొసుగులు ఉండడంతో ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఆ అంశాన్ని టార్గెట్ చేసింది.

    రుణమాఫీ అందరికీ జరగలేదని, చాలా మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులతో కలిసి తమ నిరసనలను తెలిపారు. అలాగే.. కాంగ్రెస్ హైకమండ్‌కు సైతం లేఖల రూపంలో సమస్యను తెలిపారు. ఒకవిధంగా చెప్పాలంటే.. రైతు రుణమాఫీ విషయంపై ప్రభుత్వాన్ని ఆగమాగం చేశారు. చివరకు ముఖ్యమంత్రి, మంత్రులు ప్రెస్‌మీట్లు పెట్టి దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. టెక్నికల్ సమస్యల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని, వారి సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు.

    సో.. అప్పటి నుంచి ఆ రాద్ధాంతం కాస్త చల్లారింది. ఆ వెంటనే నగరంలో హైడ్రా మీద నిరసనలు మొదలయ్యాయి. హైడ్రా మీద ప్రజలు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ తలపులు తట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు రుణమాఫీ అంశాన్ని పక్కనపడేసి ఈ హైడ్రాపై ఫోకస్ పెట్టారు. పేదల తరఫున పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు నేతలు తమ వాయిస్ వినిపిస్తున్నారు. నిరసన కార్యక్రమాల్లోనూ భాగమయ్యారు. ఇక ముందు కూడా హైడ్రాపై మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. నిరసనలు, ఆందోళనలు మరింత పీక్స్‌కు చేర్చాలని అనుకున్నారు. సహాయం కోసం వచ్చిన బాధితులందరికీ అండగా నిలవాలని పార్టీలో చర్చించారు.

    బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఇలా ఉంటే.. బీజేపీ మాత్రం రివర్స్‌లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రైతు ఉద్యమాలను బీఆర్ఎస్ పార్టీ పక్కన పెడితే ‘పాత చింతకాయ పచ్చడి’లా.. బీఆర్ఎస్ ఎప్పుడో వదిలేసిన రుణమాఫీ అంశాన్ని ఇప్పుడు భుజాన వేసుకుంది. నేడు రైతు దీక్షకు దిగింది. దీంతో పార్టీలోని సీనియర్ల నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వదిలేసిన అస్త్రాలను పట్టుకొని రాజకీయం చేయడం ఏంటని అసహనం చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు నగర వ్యాప్తంగా హైడ్రా సమస్య కొనసాగుతుంటే… ఈ సమయంలో రుణమాఫీ గురించి దీక్షలు చేస్తే ఎవరు పట్టించుకుంటారని అన్నారని టాక్.