Ram Charan : మెగా ఫ్యామిలీ హీరోలకు ఈ ఏడాది కలిసొచ్చినట్టుగా ఏ ఏడాది కూడా కలిసి రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఈ ఫ్యామిలీ హీరోలు ఈ ఏడాది అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో గెలుపొంది ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి కి ఏడాది ప్రారంభంలో పద్మ విభూషణ్ అవార్డు రావడం, వారం రోజుల క్రితమే ఆయనకు అత్యధిక డ్యాన్స్ స్టెప్పులు వేసిన ఏకైక ఇండియన్ హీరో గా ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో చోటు దక్కడం, ఇక నిన్ననే ఆయనకు ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫెడరేషన్ అకాడమీ (IIFA)’ నిర్వహించిన ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఈవెంట్ లో ‘అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ అవార్డు దక్కడం ఇలా మెగా హీరోలకు పట్టిందల్లా బంగారమే.
ఇక రామ్ చరణ్ కి ఏడాది ప్రారంభం లో డాక్టరేట్ వచ్చింది, ఇప్పుడు ఆయనకు సంబంధించిన మైనపు బొమ్మని లండన్ లోని ‘మేడం టుస్సాడ్స్’ లో త్వరలోనే ఆవిష్కరించబోతున్నారు. #RRR చిత్రం తో రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్ గా గుర్తింపు లభించింది. ఈ సినిమా నుండి అందరూ ఆయన్ని ‘గ్లోబల్ స్టార్’ అని పిలవడం మొదలు పెట్టారు. మరి అంతటి ప్రఖ్యాతలు సంపాదించినా రామ్ చరణ్ కి ఇలాంటి గౌరవం దక్కకుండా ఎలా ఉంటుంది. ఇటీవలే ‘మేడం టుస్సాడ్స్’ మ్యూజియం సిబ్బంది రామ్ చరణ్ వద్దకు వచ్చి కొలతలు తీసుకొని వెళ్లారు. రామ్ చరణ్ కి తన పెంపుడు కుక్క ‘రైమ్’ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన చేతిలో ‘రైమ్’ ఉన్నట్టుగా మైనపు విగ్రహాన్ని తయారు చేయమని రామ్ చరణ్ అడిగిన రిక్వెస్ట్ ని ‘మేడం టుస్సాడ్స్’ సిబ్బంది కాదు అనలేక పోయారు. రామ్ చరణ్ స్టైల్ గా తన పెంపుడు కుక్క రైమ్ ని చేతిలో పట్టుకొని నిల్చున్నట్టుగా ఈ మైనపు విగ్రహం ఉంటుందట.
సోషల్ మీడియా లో ఈ కుక్క ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఏకంగా చిరస్థాయిగా రామ్ చరణ్ తో పాటు ప్రఖ్యాత ‘మేడం టుస్సాడ్స్’ లో స్థానం దక్కించుకోవడం మామూలు విషయం కాదు. ఆ కుక్క గత జన్మలో ఎలాంటి పుణ్య కార్యక్రమం చేసుంటే ఇలాంటి అదృష్టం కలుగుతుందని రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు మేడం టుస్సాడ్స్ లో మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోల మైనపు విగ్రహాలు ప్రతిష్టించారు. ఇప్పుడు వారి జాబితాలోకి రామ్ చరణ్ కూడా చేరిపోయారు. ఇక పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ మాత్రమే మన స్టార్ హీరోలలో మిగిలి ఉన్నారు. వీళ్లిద్దరి మైనపు విగ్రహాలు ఎప్పుడు ఆవిష్కరిస్తారో చూడాలి.