Journalists: ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పాత్రికేయ లోకం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జీవో 252ను వెనక్కి తీసుకోవాలని లేదా సవరణలు చేయాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పాత్రికేయులు నిరసనలు చేపట్టారు. సమీపంలో ఉన్న కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు కూడా సమర్పించారు.. ఇది ఇలా సాగుతుండగానే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జర్నలిస్టులకు ఇబ్బంది కలిగించే విషయాన్ని ఒకటి చెప్పారు. దీనిని మిగతా మీడియా సంస్థలు పట్టించుకోలేదు గానీ.. నమస్తే తెలంగాణ మాత్రం ప్రముఖంగా ప్రచురించింది.
నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనం ప్రకారం.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదట. అర్బన్ ఏరియాలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వెసులుబాటు లేదట. బిపిఎల్ కోటాలో మాత్రం కావాలంటే ఇళ్ల స్థలం కేటాయించే విషయాన్ని పరిశీలిస్తుందట. ఖమ్మంలో జీవో 252 ను సవరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిశారట. జీవోను సవరించాలని.. ఇండ్ల స్థలాలను ఇవ్వాలని యూనియన్ నాయకులు కోరారట. దీనికి విక్రమార్క స్పందిస్తూ ” ఇండ్ల స్థలాల అంశంలో ఒక సుదీర్ఘమైన ఆలోచన అవసరం. పాత్రికేయులకు అర్బన్ లిమిట్లోని 5 కిలోమీటర్ల పరిధిలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అవకాశం లేదు. బిలో పావర్టి లైన్ కోటా కింద కావాలనుకుంటే ప్రభుత్వం పరిశీలిస్తుందట. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను క్రోడీకరిస్తారట. సొసైటీల ద్వారా ఇచ్చే ప్రతిపాదనపై లీగల్ ఎక్స్ పర్ట్స్ తో సంప్రదిస్తారట.” భట్టి మాట్లాడిన మాటలకు సంబంధించి ఇలా సాగింది నమస్తే తెలంగాణ కథనం.
తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. దశాబ్ద కాలంలో గులాబీ పార్టీ పాత్రికేయులకు గుర్తింపు కార్డులను ఇచ్చింది. 2016లో డెస్క్ లో పనిచేసే వారికి కూడా మంజూరు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. కార్పొరేట్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో చాలావరకు జర్నలిస్ట్ హెల్త్ కార్డులు పనిచేయలేదు. కరోనా సమయంలో పాత్రికేయులకు చేసిన సహాయం కూడా అంతంత మాత్రమే ఉంది. ఇక ఇళ్ల స్థలాల విషయాన్ని గులాబీ పార్టీ అసలు పట్టించుకోలేదు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను అడ్డం పెట్టుకొని తన సొంత మీడియాలో గాయి గాయి గత్తర గత్తర చేస్తోంది.
వాస్తవానికి ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు గతంలోని ఒక కీలకమైన తీర్పును ప్రకటించింది. అసలు పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించింది. దీంతో పాత్రికేయులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ఆగిపోయింది.. వాస్తవానికి గత ప్రభుత్వానికి కూడా ఇళ్లస్థలాల కేటాయింపు పై ఏమాత్రం శ్రద్ధ లేదు. తమకు బాకాలు ఊరే పాత్రికేయులకు అకాడమీలో కీలక స్థానాలు కట్టబెట్టి.. సైలెంట్ గా ఉండిపోయింది. గతంలో మీడియా అకాడమీలో పెద్దగా ఉన్న ఓ వ్యక్తిని పదవి నుంచి తొలగిస్తారని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనకు వెంటనే ఆయనకు పాత్రికేయుల సమస్యలు గుర్తుకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో అప్పట్లో కొంతమంది పాత్రికేయులు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేశారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ తర్వాత మీడియా అకాడమీలో ఆయన కొనసాగారు. ఆ తర్వాత గులాబీ యూనియన్ ధర్నాలు ఆగిపోయాయి. నిరసనలు నిలిచిపోయాయి..
ఇక ఇప్పటి ప్రభుత్వం కూడా ఆరు గ్యారంటీలలో భాగంగా పాత్రికేయులకు 100 కోట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని.. ఇళ్ల స్థలాల కేటాయిస్తామని.. ఇంకా అనేక రకాల వరాలు ప్రకటించింది. ఆ వరాలు కూడా ఆరు గ్యారెంటీ ల మాదిరిగానే మిగిలిపోయాయి. సరిగ్గా దీనినే గులాబీ పార్టీ అనుకూల మీడియా బూచీగా చూపిస్తోంది. ఆ కాడికి తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాత్రికేయులందరికీ ప్రయోజనం కలిగించినట్టు డప్పులు కొట్టుకుంటుంది. పాత్రికేయుల విషయంలో అటు గులాబీ పార్టీ.. ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దగా చేసిందేమీ లేదు. గులాబీ పార్టీ గుర్తింపు కార్డులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మధ్యలో విభజన రేఖ గీసి… పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడు, ఇప్పుడు బాగుపడింది ఎవరయ్యా అంటే.. లీడ్ కూడా రాయలేని ఎర్నలిస్టులు.