IAS Rizvi Takes VRS: తెలంగాణ ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని హామీ ఇచ్చి.. ప్రజా పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపించడం లేదు. పైగా రోజుకొక వివాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చులకన అవుతోంది. ఇటీవల మినిస్టర్లు సురేఖ, శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇది సద్దుమణిగిన తర్వాత తెరపైకి మరో వివాదం వచ్చింది. ఈసారి ఏకంగా ఒక ఐఏఎస్ అధికారి వాలంటరీ రిజైన్ కు సంబంధించింది. ఆ అధికారి ఏదో కావాలని వీఆర్ఎస్ తీసుకోలేదు. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కారణాలే తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి.
లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ విషయంలో తెలంగాణలో కలకలం రేగింది. ఎక్సైజ్ శాఖలో కీలక అధికారిగా పనిచేస్తున్న ఐఏఎస్ సయ్యద్ రిజ్వీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. అంతేకాదు వాలంటరీ రిటైర్మెంట్ కు దరఖాస్తు చేసిన రిజ్వీ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు జరపాలని.. ఆయన దరఖాస్తును పక్కన పెట్టాలని కృష్ణారావు ఆ లేఖలో కోరారు. అంతేకాదు రిజ్వీ వ్యవహార శైలి వల్ల తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా నష్టం వాటిలిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రిజ్వీ కి ఇంకా మూడు సంవత్సరాల పదవి కాలం ఉంది. అయినప్పటికీ ఆయన వీఆర్ఎస్ తీసుకోవడం పట్ల రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
అయితే మద్యం మీద హోలోగ్రామ్ టెండర్ విషయంలో ప్రభుత్వంలోని ఓ కీలక నాయకుడు తన అల్లుడికి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఓ మంత్రి కూడా తన కుమారుడికి ఈ టెండర్ ఇవ్వాలని సదరు అధికారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. అందువల్లే రిజ్వి తట్టుకోలేక వాలంటరీ రిటర్మెంట్ కు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. రిజ్వీ వ్యవహార శైలి పట్ల ఇప్పటికే మంత్రి కృష్ణారావు ఆగ్రహం గా ఉన్నారు. చీఫ్ సెక్రటరీ కి లేఖ కూడా రాశారు.. ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో రిజ్వీ భేటీ అయ్యారు. అంతేకాదు క్యాబినెట్ సమావేశానికి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఆయన హాజరయ్యారు. ఈ పరిణామాలన్నీ తెలంగాణ రాజకీయాలలో అత్యంత చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంది? అనే ప్రశ్న కు త్వరలోనే సమాధానం లభించనుంది.