HYDRA: హైడ్రా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానస పుత్రిక. విశ్వనగరం హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా మార్చడమే లక్ష్యంగా హైడ్రా ఏర్పాటుచేశారు. ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలను చెర విడిపించడమే లక్ష్యంగా హైడ్రా దూకుడు పెంచింది. నెల రోజుల్లోనే 43 ఎకరాలకుపైగా కబ్జా స్థలాలను స్వాధీనం చేసుకుంది. హైడ్రా దూకుడు చూసి ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారు ఇప్పుడు కోర్టులకు వెళ్తున్నారు. తమకు అనుమతులు ఉన్నాయని పత్రాలు చూపుతున్నారు. మరోవైపు సీఎం ఎవరు ఒత్తిడి చేసినా హైడ్రా ఆగదు అని స్పష్టం చేశారు. హైడ్రాకు మరింత పవర్ కల్పిస్తామని, చట్టబద్ధత, పోలీస్ స్టేషన్ పవర్ ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులకు సిద్ధమైంది. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా సిఫారసు చేసింది. జీహెచ్‌ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్ తోపాటు హెచ్‌ఎండీయే అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, సర్వేయర్ సహా బాచుపల్లి తహసీల్దార్పై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు.
స్థానికుల నుంచి ఫిర్యాదులు..
హైడ్రాకు స్థానికుల నుంచి ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బాచుపల్లి ఎర్రకుంటలో అక్రమంగా నిర్మిస్తున్న మూడు భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఆ భవనాలపై స్థానికుల నుంచి వరుసగా ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదని అధికారులపై అభియోగాలున్నాయి. ఆధారాలతో సహా సమర్పించినా పక్కన పెట్టేశారని హైడ్రా దృష్టికి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులను, అధికారులపై అభియోగాలను పరిశీలించిన రంగనాథ్.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఇప్పుడు వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. వీరితోపాటు గండిపేట వద్ద ఖానాపూర్, చిల్కూరులోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి సూపరింటెండెంట్ పై కూడా చర్యలు తీసుకునేందుకు హైడ్రా ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
అధికారులకు హైడ్రా సెగ..
అక్రమ నిర్మాణదారులకే కాదు.. నిబంధనలకు నీళ్లు వదిలిన అధికారులకూ హైడ్రా సెగ తగిలింది. కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాల్లో నాటి నుంచి విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల వివరాలను సేకరిస్తోంది. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో చిన్నా పెద్దవి కలిపి సుమారు 200కి పైగా నిర్మాణాలు కూల్చివేసినట్లు అధికారుల సమాచారం. 50 ఎకరాల వరకు ప్రభుత్వ, చెరువుల భూములను పరిరక్షించినట్లు హైడ్రా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు.
నిబంధనల పరిశీలన..
పర్యవేక్షణ అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాలు నిబంధనల మేరకు జరుగుతున్నాయా? లేదా? అన్నది తనిఖీ చేయాల్సి ఉంటుంది. అనుమతులు లేని పక్షంలో కూల్చివేతలు చేపట్టాలి. పర్యవేక్షణ అధికారులే కాదు ప్రతి విభాగంలోని ఎన్‌ఫోర్సమెంట్ అధికారులకు కూడా నిర్మాణాలపై ఓ కన్నేసి ఉంచాల్సిన బాధ్యత ఉంది. కొన్ని ప్రాంతాల్లో సర్వే నంబర్లు వేరుగా వేసి నిర్మాణ అనుమతులు తీసుకున్నట్లు కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. అనుమతులు జారీచేసే ముందు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. అలాచేస్తే సర్వే నంబరు సరైనదా? కాదా? గుర్తించడం అధికారులకు పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఈ మేరకు అక్రమ నిర్మాణాలకు సంబంధించి.. ఆయా ప్రాంతాల్లో పనిచేసిన అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించడంలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నిబంధనలను అమలు చేయని అధికారుల లెక్కలు తీసేపనిలో పడింది హైడ్రా.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Hydra is prepared for criminal cases against officials who have given permission for constructions under ftl
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com