Telangana hydra : హైడ్రా దూకుడు చర్యల నేపథ్యంలో ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులను మినహాయించి, కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకులకు చెందిన భవనాలను మాత్రమే పడగొడుతున్నారని మండిపడుతున్నారు.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికార పార్టీ నాయకులు అక్రమంగా నిర్మించిన భవనాలను కూడా కూలగొట్టాలని సవాల్ విసురుతున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి అనుకూల మీడియా హైడ్రా పనితీరును తప్పుపడుతోంది. ఇటీవల సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల కొట్టడం సరికాదని వ్యాఖ్యానిస్తోంది. ఇలాంటి చర్యల వల్ల సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వదిలి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయే ప్రమాదం ఉందని లేనిపోని ప్రచారాలు చేస్తోంది. మరోవైపు అధికార పార్టీ నాయకుల నిర్మాణాలు ఎందుకు కూల్చివేయడం లేదని ప్రశ్నిస్తోంది. ఇది సహజంగానే హైడ్రాకు ఇబ్బందిగా పరిణమించింది. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాదులో పలు చెరువులను ఆక్రమించి పలువురు రాజకీయ నాయకులు కట్టడాలు నిర్మించారు. ఈ జాబితాలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎంఐఎం నేత ఓవైసీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొంతమంది మల్లారెడ్డి, ఓవైసీ చేపట్టిన అక్రమ కట్టడాల వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి విస్తృతంగా వ్యాప్తిలోకి రావడం మొదలుపెట్టాయి. ఇదే విషయాన్ని రంగనాథ్ దృష్టికి కొంతమంది విలేకరులు తీసుకెళ్లగా ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ” హైడ్రా అనేది రాజకీయ చదరంగంలో పావుకాదు. మల్లారెడ్డి, ఓవైసీ కాలేజీల్లో చాలామంది విద్యార్థులు చదువుతున్నారు. వారి భవిష్యత్తు పాడు కాకూడదు అనే ఉద్దేశంతోనే ఆ కళాశాలలకు కొంత సమయం ఇస్తున్నాం. ఆ తర్వాత వారు మేము చెప్పిన చర్యలు తీసుకోకపోతే రంగంలోకి దిగాల్సి వస్తుంది. అప్పుడు పార్టీలకు అతీతంగా మా చర్యలు ఉంటాయి. ఒకవేళ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఏదైనా ధార్మిక క్షేత్రం ఉన్నా దానిని పడగొడతాం. నగరంలో ఉన్న చెరువులు, పార్కులను కబ్జా కాకుండా కాపాడుతాం. హైడ్రా అనేది నోటీసులు ఇవ్వదు. దాని పని కూల్చడమే” అని రంగనాథ్ పేర్కొన్నారు.
రంగనాథ్ ను మరోవైపు భారతీయ జనతా పార్టీ చెందిన పలువురు కార్పొరేటర్లు కలిశారు. ఈ సందర్భంగా పలు చెరువుల్లో జరుగుతున్న అక్రమాలను, ఆక్రమణలను రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించారు. మరోవైపు హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటల ఆక్రమణలపై హైడ్రాకు కుప్పలు తిప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా హైడ్రా కార్యాలయానికి ప్రతిరోజు మధ్యాహ్నం తర్వాత భారీ ఎత్తున ఫిర్యాదులు చేయడానికి అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో హైడ్రా కార్యాలయం కిక్కిరిసిపోతోంది. దీంతో పోలీసులు ఆ కార్యాలయానికి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు రంగనాథ్ ఇంటికి కూడా భద్రతను పెంచారు. ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Hydra commissioner ranganath gave a shock to owaisi and mallareddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com