Hyderabad Niloufer Cafe Owner: హైదరాబాద్ లో చార్మినార్, హైటెక్ సిటీ, బుద్ధుడి విగ్రహం, రామోజీ ఫిలిం సిటీ .. ఇవన్నీ కూడా ఐకానిక్ సింబల్స్. ఇంకా వీటి జాబితా పెరుగుతూనే ఉంది. అయితే తొలిసారిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ లో ఓ సామాన్యుడు చేసిన అద్భుతం చేరింది. అది కాస్త దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆ అద్భుతాన్ని ఆవిష్కరించిన వ్యక్తి పేరు బాబురావు.
హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు అధికంగా ఉండే ప్రాంతంలో కొన్ని నెలల క్రితం నీలోఫర్ కేఫ్ ఏర్పాటయింది. ఇందులో లభించే టీ, మస్కా బన్ అత్యంత ముఖ్యమైనవి. కేవలం ఇవి మాత్రమే కాకుండా.. ఇంకా చాలా ఉత్పత్తులను నిలోఫర్ కేఫ్ లో విక్రయించడం మొదలుపెట్టారు. ఇక్కడ విక్రయించే టీ ధర కూడా ₹1000 దాకా ఉంటుంది. అదే కాదు నిలోఫర్ కేఫ్ ఏర్పాటుచేసిన భవనం అద్దె కూడా లక్షల్లో ఉంటుంది. ఈ అద్దె చెల్లింపుకు సంబంధించిన వార్త కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ పోతే నిలోఫర్ కేఫ్ గురించి రాయడానికి చాలా ఉంది.
నిలోఫర్ కేఫ్ ను బాబురావు ప్రారంభించారు.. ఈయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. ఒక బట్టల షాపులో పనిచేసే.. ఆ తర్వాత హోటల్ పెట్టారు. క్రమక్రమంగా ఎదిగారు. హైదరాబాదులో ఐకానిక్ సింబల్స్ జాబితాలో తన నిలోఫర్ కేఫ్ కూడా ఉండడం బాబురావు సాధించిన విజయానికి ఒక ప్రతీక. అటువంటి బాబురావు ఇప్పుడు మళ్లీ వార్తలలో నిలిచారు. అలాగని ఈసారి ఆయన కొత్త కేఫ్ ఏర్పాటు చేయలేదు. హోటల్ కూడా నిర్మించలేదు.. ఈసారి ఆయన ఆధ్యాత్మిక కోణంలో వార్తల్లోకి ఎక్కారు. ఎక్కడం మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా తన గురించి చర్చ జరిగేలా చూసుకున్నారు.
బాబురావు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు.. ఇటీవల బాబు రావుకు ఓ కల వచ్చింది. అందులో వెంకటేశ్వర స్వామి ఆయనకు కనిపించారు. తనకోసం ఒక యజ్ఞోపవీతం తయారు చేయించాలని స్వామివారు బాబురావును కోరారు. దీంతో బాబురావు వెంటనే యజ్ఞోపవీతం తయారు చేయించారు. దీనికోసం మేలిమి బంగారు, వజ్రాలను ఉపయోగించారు. నాలుగున్నర కోట్లు ఖర్చుపెట్టి దీనిని తయారు చేయించారు. దీనిని తయారు చేయడానికి దాదాపు నెల రోజుల వరకు సమయం పట్టింది. గత నెలలో కుటుంబంతో కలిసి బాబురావు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కలలో స్వామి వారు వచ్చి ఇలా యజ్ఞోపవీతం అడిగినట్టు అనిపించింది. అందుకే నాలుగున్నర కోట్లు ఖర్చుపెట్టి వెంకటేశ్వర స్వామికి బాబురావు యజ్ఞోపవీతం తయారు చేయించారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కాకుండా.. సేవ విషయంలోనూ బాబురావు ముందుంటారు. తన కేఫ్ లో తయారు చేసే ఉత్పత్తులను పేద పిల్లలకు అందిస్తుంటారు. వారి చదువుకు కూడా సహాయం చేస్తుంటారు. బాబురావు ఆర్థిక సహాయం చేసిన చాలా మంది పిల్లలు జీవితంలో స్థిరపడ్డారు. ఇప్పటికీ తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది పిల్లల చదువులకు బాబురావు ఆర్థికంగా సహాయం చేస్తూనే ఉంటారు. భవిష్యత్తు కాలంలో ఒక స్కూలును ఏర్పాటు చేయాలని బాబురావు లక్ష్యంగా పెట్టుకున్నారు.