Man left Amazon to drive cabs: నేటి కాలంలో చాలా మంది యువత ఎక్కువ జీతం, కార్పొరేట్ ఉద్యోగం, విలాసవంతమైన జీవితం కావాలని కోరుకుంటున్నారు. ఇదే తమ జీవిత విజయానికి కొలమానాలుగా భావిస్తున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఎప్పుడూ కంప్యూటర్ల ముందు మెకానికల్ గా పనిచేయడం కంటే.. మనుషుల మధ్య ఉండడం చాలా అవసరం అని చెబుతున్నారు. ప్రతిరోజూ ఎంతో మందితో మాట్లాడడం వల్ల అధిక సంతోషంగా ఉండవచ్చని తెలుపుతున్నారు. అందులో భాగంగా క్యాబ్ డ్రైవర్‌గా సంతోషంగా జీవితస్తున్నట్లు తెలిపారు. ఇంతకీ ఆయన ఇలా ఎందుకు చెబుతున్నాడు?
హైదరాబాద్ కు చెందిన కుమార్ 2014 వరకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ Amazon లో ఉద్యోగం చేశారు. మంచి జీతం, స్థిరమైన కెరీర్ ఉన్నప్పటికీ ఆయనకు ఆ పని అంతగా సంతృప్తిని ఇవ్వలేదట. కొత్త ప్రాంతాలను చూడడం, కొత్త వ్యక్తులను కలవడం తనకు ఎంతో ఇష్టమని భావించిన కుమార్ చివరకు ఉద్యోగానికి రాజీనామా చేసి క్యాబ్ డ్రైవర్‌గా మారాలని నిర్ణయించుకున్నారు. 12 ఏళ్లుగా ఆయన హైదరాబాద్ నగరంలో క్యాబ్ నడుపుతున్నారు. ఈ కాలంలో దాదాపు 23,600 ట్రిప్పులు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. నగరంలోని ప్రతి ప్రాంతాన్ని అన్వేషించడం, కొత్త మార్గాలను తెలుసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని కుమార్ పేర్కొన్నారు. ఒకే కార్యాలయంలో కూర్చొని పనిచేయడం కంటే నగరాన్ని చుట్టేస్తూ పని చేయడమే తనకు నచ్చుతుందని చెప్పారు.
ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులను కలవడం తన ఉద్యోగంలో అత్యంత ఆసక్తికరమైన అంశమని ఆయన అంటున్నారు. వివిధ వృత్తులు, ప్రాంతాలు, సంస్కృతులకు చెందిన వ్యక్తులతో మాట్లాడటం ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటానని చెప్పారు. ప్రతి ప్రయాణికుడి కథ భిన్నంగా ఉండటం వల్ల తన పని ఎప్పుడూ బోర్‌గా అనిపించదని వెల్లడించారు.
ఇటీవల ఓ మహిళా టెకీ కుమార్‌తో చేసిన ప్రయాణ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మంచి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి, తనకు ఇష్టమైన పనిని ఎంచుకుని సంతోషంగా జీవిస్తున్న కుమార్ గురించి ఆమె చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంది. డబ్బు కంటే మనసుకు నచ్చిన పని ముఖ్యమని ఆయన నిరూపించారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
కుమార్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. జీవితంలో విజయం అంటే కేవలం అధిక జీతం కాదని, మనకు ఆనందాన్ని ఇచ్చే పనిని చేస్తూ సంతృప్తిగా జీవించడమూ విజయమేనని ఆయన కథ మరోసారి గుర్తు చేస్తోంది. బాధ్యతలను నిర్వర్తిస్తూనే ప్యాషన్‌ను కొనసాగించవచ్చని కుమార్ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
