Khalistan conspiracy latest news: జూన్ 4వ తేదీ ఉదయం 9:54 గంటలకు ఢిల్లీ సమీపంలోని పంచ్‌కుల మేయర్ శ్యాంలాల్‌కు ఒక ఈమెయిల్ వచ్చింది. దాని పంపినవారు ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ అని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఆరు ఆలయాల్లో బాంబులు పెట్టామని, 5, 6వ తేదీల్లో ఆ ఆలయాలకు వెళ్లవద్దని బెదిరించారు. మేయర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్వాడ్‌తో పూర్తి తనిఖీలు జరిగాయి. బాంబు లేదని తేలింది. ఇది కేవలం హోక్స్.
దేశవ్యాప్తంగా బెదిరింపులు..
జనవరి 28 నుంచి జూన్ 10 వరకు దేశంలోని ఐదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో (పంజాబ్ మినహా) దేవాలయాలు, నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం, కోర్టులు ఇలా అనేక ముఖ్యమైన ప్రదేశాలకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వరుసగా వచ్చాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రాలన్నీ బీజేపీ పాలనలో ఉన్న ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు. పది ప్రముఖ దేవాలయాలకు పదే పదే మెయిల్స్ వచ్చాయి. ఇవి కేవలం బెదిరింపులే అయినప్పటికీ, ప్రజల్లో భయం, అనుమానం, గందరగోళం సృష్టించాలనుకున్నారు.
ఇంటెలిజెన్స్ విచారణలో షాకింగ్ విషయాలు..
గూఢచార సంస్థలు ఈ మెయిల్స్‌ను లోతుగా పరిశీలించాయి. ఫలితంగా ఈ మెయిల్సన్నీ అజర్‌బైజాన్ నుంచి వస్తున్నట్లు తేలింది. అజర్‌బైజాన్ మాజీ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన తర్వాత ఏర్పడిన దేశం. ఇక్కడి నుండి బెదిరింపులు పంపడం యాదృచ్ఛికం కాదు. జనవరి 16 అజర్‌బైజాన్‌లో ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ సమావేశం జరిగింది. అమెరికా, యూరప్, పాకిస్తాన్‌లోని ఖలిస్తానీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో అన్ని అనుబంధ సంస్థలు ఇకపై ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ పేరిటే పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది వివిధ ఖలిస్తానీ గ్రూపులను ఒకే ఛత్రం కిందకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నం.
అజర్‌బైజాన్‌లోనే ఎందుకు..
ఈ దేశాన్ని కొత్త కేంద్రంగా ఎంచుకోవడం వెనుక కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వానికి తెలియకుండా సమావేశం జరగడం సాధ్యమైంది. ఇతర దేశాల్లో ఉన్నట్లు కఠినమైన నిఘా ఉంటుంది. అజర్‌బైజాన్‌లో అలాంటిది ఉండదు. ముస్లిం దేశం. తుక్కియేకు సన్నిహితంగా ఉంటుంది. భారత్‌పై వ్యతిరేక వైఖరి కలిగి ఉందని సమాచారం. ఖలిస్తానీ ఉగ్రవాదులు ఈ కొత్త దేశాన్ని ఉపయోగించి డిజిటల్‌గా బెదిరింపులు పంపి, భారత్‌లో భయోత్పాతం సృష్టించాలని చూస్తున్నారు.
ఖలిస్తానీ గ్రూపులు ఇప్పుడు పాకిస్తాన్‌కు మాత్రమే పరిమితం కాకుండా, అజర్‌బైజాన్ వంటి కొత్త దేశాలను ఆశ్రయంగా ఎంచుకుంటున్నాయి. ఇది వారి వ్యూహంలో మార్పును సూచిస్తుంది. సంప్రదాయికంగా పాకిస్తాన్‌లో ఉన్న నిఘా, అంతర్జాతీయ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి కొత్త ఆశ్రయాలు వెతుకుతున్నారు.
