Sudden Weather Change Hyderabad: అప్పటిదాకా వాతావరణం వేడిగా ఉంది. సూర్యుడు దంచి కొడుతున్నాడు. నడి నెత్తిన కొరవి మాదిరిగా మండుతున్నాడు. ఆ ఎండలకు రోడ్లంగా జనం కూడా పల్చగా ఉన్నారు. వాహనాల రాకపోకలు కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయి. ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. చల్లగాలి ప్రారంభమైంది. ఆకాశం మొత్తం మేఘాలు కమ్ముకున్నాయి.. వర్షం మొదలైంది. మంచు గడ్డలు ఆకాశము నుంచి ధారాళంగా పడుతూనే ఉన్నాయి. అప్పటిదాకా ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ ప్రాంతం మొత్తం హిమాలయాలను తలపించింది.
ఇది జరిగింది ఎక్కడో మన్యం ప్రాంతంలోనో.. జమ్ము కాశ్మీర్ దగ్గరలోనో కాదు.. మన హైదరాబాద్లో.. హైదరాబాదులో ఒకప్పుడు వాతావరణం చాలా బాగుండేది. ఎండాకాలం కూడా ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీలకు మించిపోయేవి కావు. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ గా మారిన తర్వాత హైదరాబాద్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎండలకు తోడు ఉక్కపోతవల్ల జనం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఏసీ లేకుండా ఉండలేని దుస్థితి నెలకొంది. అయితే అటువంటి హైదరాబాదులో సోమవారం రాత్రి కొట్టిన వర్షం నగర ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వడగండ్ల వర్షం విపరీతంగా కురిసింది. శంషాబాద్ నుంచి నాదర్గుల్ ఔటర్ రింగ్ రోడ్డు మీద భారీగా వడగండ్ల వర్షం పడింది. దీంతో రోడ్డు మీద మొత్తం మంచు ముద్దలు కనిపించాయి. చాలామంది వడగండ్ల వర్షాన్ని చూసి ఆకాశం నుంచి మంచు ముక్కలు పడుతున్నాయని అనుకున్నారు. వర్షం కురిసిన తర్వాత ఆ ప్రాంతం మొత్తం చల్లగా మారిపోయింది. దీంతో నడి ఎండాకాలంలో హైదరాబాద్ నగరం హిమాలయ పర్వతాలను తలపిస్తోందని చాలామంది వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు.
వడగండ్ల వర్షం ప్రతి ఎండాకాలంలో పడుతూనే ఉంటుంది. అయితే ఈసారి హైదరాబాద్ నగరంలో ముందుగానే వడగండ్ల వర్షం కురిసింది. సాధారణంగా ఖరీఫ్ ప్రారంభానికి ముందు ఇటువంటి వర్షాలు పడతాయి. అయితే ఈసారి వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఈ తరహా వర్షాలు కురిసాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నీనో ఏర్పడటం వల్ల కరువు కాటకాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బహుశా ఆ ప్రభావం వల్లే ఇప్పుడు వడగండ్ల వర్షం కురిసిందేమోనని అధికారులు అంచనా వేస్తున్నారు.
More Videos from #Shamshabad ORR #Hailstrom ⛈️ pic.twitter.com/fMDxZEvtOB
— Hyderabad Rains (@Hyderabadrains) April 27, 2026
