Hyderabad Girl Viral Reel: గొప్ప వ్యక్తి కావాలంటే గొప్ప పనులు చేయాలి. సమాజంలో పేరొందిన వ్యక్తిగా ముద్రపడాలంటే.. కష్టపడాలి.. ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఏటికి ఎదురీదాలి. అప్పుడే విజయాలు సాధ్యమవుతాయి. సమాజంలో గొప్ప పేరు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు సొంతమవుతాయి. ఒకప్పుడు ఇలా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సెలబ్రిటీలు కావాలని భావిస్తున్నారు. దీనికోసం చేయాల్సిన అడ్డమైన పనులు మొత్తం చేస్తున్నారు. వారు చేస్తున్న అడ్డమైన పనుల వల్ల సమాజం తీవ్రంగా ప్రభావితమవుతోంది.
ఇటీవల ఇండోనేషియా ప్రాంతానికి చెందిన ఓ బాలుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ముఖ్యంగా పడవ మీద ప్రయాణిస్తూ అతడు చేసిన హావభావాలు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. అతని హావభావాలను దృష్టిలో పెట్టుకొని.. వచ్చిన పాపులారిటీని పరిగణలోకి తీసుకొని ఇండోనేషియా ప్రభుత్వం అతడిని ఏకంగా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. అతడి వల్ల తమ దేశానికి పర్యాటకంగా మరింత గుర్తింపు లభిస్తుందని భావించింది. ఆదేశం అంచనా వేసిన విధంగానే అతడు సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా.. తమ దేశానికి గుర్తింపు తీసుకొచ్చాడు. వాస్తవానికి ఆ బాలుడు ప్రదర్శించిన హావభావాలలో ఒక రిధం ఉంది. అతడు హావ భావాలను ప్రదర్శిస్తుంటే చూడాలనిపించింది. ఏ ముహూర్తాన ఆ బాలుడు అలాంటి హావభావాలను ప్రదర్శించాడో తెలియదు కానీ.. ప్రపంచం మొత్తం అతడిని అనుకరించడం మొదలు పెట్టింది. చివరికి ఆ పైత్యం మన దేశానికి కూడా వచ్చింది.
Also Read: పాండవులు నడయాడిన ప్రాంతం అది.. ఈ వర్షాకాలంలో నయాగారాను తలపిస్తుంది..
తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది యువత ఇండోనేషియా బాలుడి స్టైల్ అనుకరించడం మొదలుపెట్టారు. అయితే అతడు చేస్తే చూసే విధంగా ఉంటే.. వీళ్లు చేస్తుంటే చండాలంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఓ యువతీ తన బీఎండబ్ల్యూ కారు మీద ఇండోనేషియా బాలుడి మాదిరిగానే హావ భావాలను ప్రదర్శించడం మొదలు పెట్టింది. పైగా నడిరోడ్డు మీద..ట్రాఫిక్ విపరీతంగా ఉన్న ప్రాంతంలో ఆమె అలాంటి హావభావాలను ప్రదర్శించడం తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది. ఆ యువతి పాల్పడుతున్న చేష్టలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ యువతి పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ యువతిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..” సోషల్ మీడియాలో స్టార్ కావాలి అనుకుంటే ఏవైనా మంచి పనులు చేయాలి. నూతనత్వం ఉన్న వీడియోలు పోస్ట్ చేయాలి. అంతేగాని ఇలా ఒకరి స్టైల్ అనుకరించి.. పదిమందికి ఇబ్బంది కలిగించేలా చేయకూడదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.