Miyapur: నోట్ల కట్టలు.. బంగారపు బిస్కెట్లు.. వెండి ఆభరణాలు.. వాటిని లెక్కిస్తుంటే పోలీసులకు మతి పోయినంత పనైంది. బంగారు ఆభరణాలను చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. వెండి నగలను లెక్కిస్తుంటే మెంటల్ ఎక్కినంత పనైంది. వీటన్నింటికీ లెక్కా పత్రాలు లేవు. పోలీసులు అడుగుతుంటే వాటిని తీసుకొస్తున్న వ్యక్తులు నీళ్లు నమిలారు. సినిమాల్లో లాగా అమాయకంగా ఫేసులు పెట్టారు. తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో నగదు, బంగారం పట్టుబడుతూనే ఉంది. కానీ ఈ స్థాయిలో బంగారం, నగదు, వెండిని స్వాధీనం చేసుకోవడం మాత్రం ఇదే తొలిసారి.
నగదు, బంగారం, వెండి
ఎన్నికల తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో సోమవారం ఉదయం మియాపూర్ ప్రాంతంలో మాదాపూర్ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు సందేహం వచ్చి అందులో తనిఖీలు చేపట్టగా వారికి దాదాపు షాక్ తగిలే విధంగా అందులో నగదు, బంగారం, వెండి లభ్యమయ్యాయి. ఎలాంటి పత్రాలు లేకుండా 27 కిలోల బంగారం, 15 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ముగ్గురు వ్యక్తులను వీటికి సంబంధించి పోలీసులు ప్రశ్నించగా ఎటువంటి సమాధానాలు చెప్పలేదు. ఆ వ్యక్తుల వ్యవహార శైలి గమనించిన పోలీసులు ఈ సొత్తు మొత్తం ఎన్నికల్లో పంచడానికి తీసుకెళ్తున్నారని ఒక అంచనాకు వచ్చారు. అయితే ఆ వ్యక్తుల తరఫున ఎవరూ పోలీస్ స్టేషన్ వద్దకు రాకపోవడంతో పోలీసుల అనుమానమే నిజమైనట్టు తెలుస్తోంది. నిందితులు బషీర్ బాగ్ నుంచి బంగారు, వెండి ఆభరణాలు తీసుకెళ్తున్నట్టు సమాచారం. ఈ తనిఖీల్లో మొత్తం 14.70 కోట్ల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నామని మియాపూర్ పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన మరచి పోక ముందే స్కూటీ లో తరలిస్తున్న 14.93 లక్షల నగదును పోలీసులు అదే ప్రాంతంలో స్వాధీనం చేసుకోవడం విశేషం. నిందితుల పై కేసు నమోదు చేసినట్టు మియాపూర్ పోలీసులు ప్రకటించారు.
దొరికేదంతా హవాలా సొమ్మేనా?
భూమి, ఇల్లు, ఇతర స్థిరాస్తి కొనుగోలులో ఒప్పందం మేరకు చెల్లింపులకు తీసుకెళ్తున్న నగదు హవాలా కింద సీజ్. పెళ్లిళ్లు, ఆస్పత్రి ఖర్చులకు చేబదులుగా తీసుకున్న డబ్బు వెంట ఉన్నా సీజ్.. చివరకు పెద్దమొత్తంలో నగదు పట్టుకున్నట్లుగా పేరు. అయితే, ఎన్నికల వేళ పోలీసులు చేపడుతున్న ఈ తనిఖీలు సామాన్యులకు మాత్రం ఇబ్బందికరంగా మారుతున్నాయి. డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునే పేరిట వారి చర్యలు ప్రజలను కష్టపెడుతున్నాయి. దీంతో పట్టుకున్నదంతా హవాలా డబ్బేనా..? సమస్యలను కనీసం అర్థం చేసుకోరా? అంటూ ఆవేదన వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో నిబంధనల మేరకు రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా రుజువులు కలిగి ఉండాలి. దీనిపై చాలామంది ప్రజలకు అవగాహన లేదు. ఇలాంటివారి వద్ద ఉన్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు, ఇతర అవసరాలకు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్నవారు, ఆస్పత్రుల్లో బిల్లులు చెల్లించేందుకు డబ్బు వెంట తెచ్చుకుంటున్నవారు ఊహించని పరిణామానికి ఆందోళనకు గురవుతున్నారు.
కూడబెట్టుకున్న సొమ్మును పట్టుకుంటే ఎలా?
ఇటీవల ఆస్పత్రి బిల్లు చెల్లింపునకు అప్పు చేసి ఓ కుటుంబం తీసుకెళ్తున్న డబ్బును స్వాధీనం చేసుకోవడంపై విమర్శలు వచ్చాయి. మరోవైపు నిబంధనలకు విరుద్ధమే అయినా.. సాధారణంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో కొంత మొత్తం లెక్కల్లో ఉండదు. ఈ క్రమంలో పైసాపైసా కూడబెట్టి ఆస్తి కొనుగోలుకు వెళ్తుంటే దానిని పట్టుకుంటే ఎలా? అని ప్రజలు వాపోతున్నారు. అవసరాలకు డబ్బు తీసుకెళ్తున్నవారి పరిస్థితిని, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు గుర్తించాలని కోరుతున్నారు. డబ్బు ఏ అవసరానికి తీసుకెళ్తున్నారో నిర్ధారించుకునే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. చేతిలో ఉన్న మొత్తానికి చాలా సందర్భాల్లో లెక్క చూపడం సాధ్యం కాదనే విషయం అర్థం చేసుకుని వ్యవహరించాలని విన్నవిస్తున్నారు.
పార్టీలు, నాయకుల డబ్బు సురక్షితం..
సామాన్య ప్రజల కష్టాలు ఇలా ఉంటే.. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రధాన రాజకీయ పార్టీలు, నేతలు కోట్ల రూపాయలను అనుచరులతో సురక్షిత ప్రదేశాలకు చేర్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కంటికి కనపడకుండా జరిగిందని.. దీనిపై కనీస నిఘానే లేదన్న విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు పట్టుకున్న డబ్బు ఏ పార్టీ, నాయకుడికి సంబంధించినది కాదనే సంగతిని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. తనిఖీల పేరుతో ప్రధాన రోడ్లతో పాటు చిన్న దారుల వెంట పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో కూడళ్ల వద్ద, యూ టర్న్ తీసుకునే దగ్గర చాలా సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
View Author's Full InfoWeb Title: Huge gold and silver seized in miyapur