Lok Sabha Election 2024: తెలంగాణలో మూడ్‌ ఎలా ఉంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడానికి తెలంగాణలో అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు విపక్ష పార్టీ బీఆర్‌ఎస తీవ్రంగా శ్రమించాయి.

Written By: Raj Shekar, Updated On : May 14, 2024 10:59 am

Lok Sabha Election 2024

Follow us on

Lok Sabha Election 2024: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల మహా సంగ్రామం ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ సీట్లతోపాటు 175 అసెంబ్లీ సీట్లకు సోమవారం పోలింగ్‌ జరిగింది. దాదాపు 5 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్‌ 4న జడ్జిమెంట్‌ వెలువడనుంది. ఈ క్రమంలో ఓటర్ల మూడు ఎలా ఉంది అన్న చర్చ తెలంగాణలో జరుగుతోంది. పార్టీలతోపాటు విశ్లేషకులు కూడా ఓ అంచనాకు వస్తున్నారు.

చమటోడ్చిన మూడు పార్టీలు..
ఇక లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడానికి తెలంగాణలో అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు విపక్ష పార్టీ బీఆర్‌ఎస తీవ్రంగా శ్రమించాయి. కాంగ్రెస్‌ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి అన్నీతానై నడిపించారు. పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖర్గేలను కూడా రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రచారం చేయించారు. ఇక బీజేపీ అయితే ప్రచారంలో దూకుడు ప్రదర్శించింది. షెడ్యూల్‌కు ముందు నుంచే ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, పొరుగు రాష్ట్రాల ఎంపీలను రంగంలోకి దించింది. మిగతా పార్టీలకు అందనంతగా ప్రచారంలో దూకుడు ప్రదర్శించింది. ప్రధాని మోదీ ఏకంగా నాలుగుసార్లు తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు ఊపు తెచ్చేందుకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారు బస్సు యాత్రతో పది నియోజకవర్గాలను చుట్టేశారు. మరోవైపు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.

64.93 శాతం పోలింగ్‌..
ఇక సోమవారం నిర్వహించిన తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 64.93 శాతం పోలింగ్‌ నమోదైంది. పది స్థానాల్లో 70 శాతానికిపైగా పోలింగ్‌ నమోదవడం విశేషం. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నియోజకవర్గాలు మినహా రాష్ట్రాంలోని మిగతా 13 స్థానాల్లో 60 శాతం నుంచి 70 శాతం వరకు ఓటింగ్‌ నమోదైంది. పెరిగిన ఓటింగ్‌ ఎవరికి లాభిస్తుందన్న చర్చ జరుగుతోంది. పార్టీలు ఎవరికి వారు అనుకూలంగా లెక్కలు వేసుకుంటున్నాయి.

నియోజకవర్గాల వారీగా పోలింగ్‌..
ఇక లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్‌ శాతం పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో 7.96, పెద్దపల్లిలో 67.88 శాతం, కరీంనగర్‌లో 72.33 శాతం, నిజామాబాద్‌లో 71.50 శాతం, జహీరాబాద్‌లో 74.54, మెదక్‌లో 74.38 శాతం, మల్కాజ్‌గిరిలో 50.12 శాతం, సికింద్రాబాద్‌లో 48.11 శాతం, హైదరాబాద్‌లో 46.08 శాతం, చేవెళ్లలో 55.45 శాతం, మహబూబ్‌నగర్‌లో 71.54 శాతం, నాగర్‌కర్నూల్‌లో 68.29 శాతం, మహబూబాబాద్‌లో 70.68 శాతం, వరంగల్‌లో 68.29 శాతం, ఖమ్మంలో అత్యధికంగా 75.19 శాతం పోలింగ్‌ నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ప్రాతినిధ్యవం వహించిన మల్కాజ్‌గిరిలో ఈసారి పోలింగ్‌శాతం బాగా తగ్గింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో కూడా ఓటర్లు పెద్దగా స్పందించలేదు.

కాంగ్రెస్‌ కంచు కోటల్లో రికార్డు పోలింగ్‌..
ఇక కాంగ్రెస్‌కు కంచు కోటలుగా భావించిన భువనగిరి, ఖమ్మం నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో పోలింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. కరీంనగర్, జహీరాబాద్, ఆదిలాబాద్ లో కూడా అత్యధికంగా పోలింగ్‌ నమోదైంది. ఫలితాలు జూన్‌ 4న వెలువడనున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు అనేది ఆరోజు వెల్లడికానుంది.

ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..
ఇక విశ్లేషకుల అంచనాలు, మూడు పార్టీలు పోలింగ్‌ సరళి ప్రకారం వేసిన లెక్కల ప్రకారం.. అధికార కాంగ్రెస్‌కు 8 నుంచి 9 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. ఇక బీజేపీ కూడా పుంజుకుంటుందని ఈసారి గంతలో కన్నా 2 నుంచి 3 స్థానాలు పెరిగి 6–7 సీట్లు గెలుస్తుందని భావిస్తున్నారు. ఇక హైదరాబాద్‌ సీటు మాత్రం ఈసారి కూడా ఎంఐఎం ఖాతాలోనే పడుతుందని అంచనా. బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా పాతబస్తీ ఓటర్లు మాత్రం ఎంఐఎం వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.