Hitech City Co-Living Controversy: హైటెక్‌సిటీ.. ఈ పేరు వినాగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తుకు వచ్చేది హైదరాబాద్, నారా చంద్రబాబు నాయుడు. విశ్వనగరానికి ఒక ల్యాండ్ మార్క్‌గా చార్మినార్‌కు ఎంత గుర్తింపు ఉందో హైటెక్ సిటీకి అంతే గుర్తింపు ఉంది. ఐటీకి కేరాప్‌గా ఉంది ఈ హైటెక్ సిటీ. ఇక్కడ భారతీయులతోపాటు విదేశీయులు కూడా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ విస్తరిస్తున్న ఓ సంస్కృతి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు దీనిపై ఎవరూ మాట్లాడలేదు. కానీ, తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమతరావు సంచలన ప్రకటన చేశారు. పాశ్చాత్య సంస్కృతిపై ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అయితే, ఇటీవల ఈ ప్రాంతంలో వేగంగా విస్తరిస్తున్న కో–లివింగ్ స్పేసెస్ స్థానిక సమాజంలో ఆందోళనలకు కారణమవుతున్నాయి. ఒకే హాస్టల్‌లో యువతీయువకులు కలిసి నివసించే ఈ విధానం సంప్రదాయ విలువలకు విఘాతం కలిగిస్తుందని కొంది ఆరోపణలు. ఈ సందర్భంగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ఈ సంస్కృతిని కట్టడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కోరారు.
Also Read: రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్: చిచ్చుపెట్టిన వీహెచ్
సాంస్కృతిక విలువలపై ప్రభావం..
కో–లివింగ్ స్పేసెస్ ఆధునిక జీవనశైలి భాగంగా యువతకు ఆర్థికంగా సౌలభ్యం, సౌకర్యవంతమైన నివాస వసతులను అందిస్తున్నాయి. అయితే, ఈ విధానం సంప్రదాయ సామాజిక నిర్మాణాలకు విరుద్ధంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే హాస్టల్‌లో ఆడ, మగ కలిసి ఉండటం సాంస్కృతిక, నైతిక విలువలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వి.హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను నంబర్ వన్ నగరంగా నిలపడానికి ఇటువంటి పరిస్థితులను నియంత్రించాలని సూచిస్తున్నారు.
సమాజం, ప్రభుత్వం బాధ్యతలు…
కో–లివింగ్ విషయంలో సమాజం, ప్రభుత్వం రెండూ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. కో–లివింగ్ స్పేసెస్‌ను నియంత్రించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడం, హాస్టల్ నిర్వహణలో పారదర్శకతను నిర్ధారించడం అవసరం. అదే సమయంలో, యువతలో సాంస్కృతిక, నైతిక విలువలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం కూడా ముఖ్యం. ప్రభుత్వం ఈ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, సామాజిక సమతుల్యతను కాపాడే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Also Read: Special Hostels: ఆధార్ కార్డు చూపిస్తే ఫుడ్, బెడ్.. ఏపీలో స్పెషల్ హాస్టల్స్!
తల్లిదండ్రుల్లో ఆందోళన..
విదేశీ ఉద్యోగుల విషయం పక్కన పెడితే.. భారతీయ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగుల తల్లిదండ్రులు ఈ కో–లివింగ్ సంస్కృతిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఐటీ ప్రొఫెషనల్స్ అని ఇంతకాలం గొప్పగా చెప్పుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ సంస్కృతి తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఈ కల్చర్ మంచిది కాదని పేర్కొంటున్నారు. ఇలాంటి సంస్కృతి యువతను అట్రాక్ట్ చేస్తుందని, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మంచిది కాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఇలాంటి సంస్కృతిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
హైదరాబాద్ ఒక వైపు ఆధునికతను ఆలింగనం చేసుకుంటూనే, మరోవైపు తన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలి. కో–లివింగ్ స్పేసెస్ వంటి కొత్త జీవన విధానాలు నగర ఆర్థిక వ్యవస్థకు దోహదపడినప్పటికీ, వాటి ప్రభావాన్ని సమాజంపై జాగ్రత్తగా పరిశీలించాలి. సరైన నియంత్రణలు, సామాజిక అవగాహన ద్వారా హైదరాబాద్ తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకోగలదు.