High Court: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని తొలిసారి హైకోర్టు తప్పుపటింది. కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను కొట్టివేసింది. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలుగా నామినేట్ అయి గవర్నర్ తిరస్కరించిన దాసోసు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు ఊరట లభించింది.
ఏం జరిగిందంటే..
గతేడాది జూలైలో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. ఈమేరకు కేబినెట్ ప్రతిపాదించింది. అయితే మూడు నాలుగు నెలలు వీరి ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టిన గవర్నర్ తమిళిసై చివరకు రాజకీయ నేపథ్యం ఉందన్న కారణంగా తిరస్కరించారు. రాజ్యాంగంలోని 171(3), 171(5) అధికరణల్లో నిర్దేశించిన మేరకు సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రం, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యత గానీ, ఆచనణాత్మక అనుభవంగానీ వీరికి లేవని అందుకే తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. కుర్రా సత్యనారాయణ రాజకీయాలు, పారిశ్రామిక కార్మిక సంఘంల కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నట్లు తెలిపారు. రాజకీయ నేపథ్యం ఉన్నవారిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయవద్దని సూచించారు.
కోర్టును ఆశ్రయించిన శ్రవణ్, సత్యనారాయణ..
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలగా తమను తిరస్కరించిన గవర్నర్.. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆమోదించడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ ఆమోదించిన కోదండరామ్ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని తెలిపారు. తమను రాజకీయ కారణాలతో తిరస్కరించి. వారిని ఆమోదించడాన్ని సవాల్ చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణ జరిపింది.
గెజిట్ కొట్టివేత..
దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వేసిన పిటిషన్‌పై పలుమార్లు కోర్టు విచారణ జరిపింది. పిటిషన్ విచారణ అర్హత లేదని గవర్నర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కానీ, కోర్టు పూర్తి విచారణ చేసింది. ఈ క్రమంలో గురువారం (మార్చి 7న) కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా గుర్తిస్తూ జారీ చేసిన గెజిట్‌ను కొట్టివేసింది. కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని గవర్నర్‌కు సూచించింది. ఎమ్మెల్సీల నియామకంపై పునఃపరిశీలన చేయాలని తెలిపింది.