https://oktelugu.com/

MLC Kavitha: కవితకు బెయిలా.. జైలేనా… ఈసారైనా ఊరట లభిస్తుందా?

కవిత జుడీషియల్‌ రిమాండ్‌ ఏప్రిల్‌ 23న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఉంది. ఈ నేపథ్యంలో రౌస్‌ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న టెన్షన్‌ గులాబీ శ్రేణుల్లో కనబడుతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 22, 2024 / 12:33 PM IST

    MLC Kavitha

    Follow us on

    MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోనం కేసులో కీలకమైన వ్యక్తిగా ఈడీ, సీబీఐ పేర్కొంటున్న వ్యక్తుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌తోపాటు తెలంగాణ మాజీ సీఎం తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఒకరు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందికిపైగా అరెస్ట్‌ అయ్యారు. ఇందులో కొందరు అప్రూవర్లుగా మారి బెయిల్‌పై బయలకు వచ్చారు. మార్చి 15న అరెస్ట్‌ అయిన కవిత, 20న అరెస్ట్‌ అయిన కేజ్రీవాల్‌ మాత్రం జైల్లోనే ఉన్నారు. వీరు బెయిల్‌ కోసం చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. కవిత అయితే కొడుకు బెయిల్‌ కోసం అంటూ మధ్యంతర బెయిల్‌ కూడా కోరారు. కానీ, కోర్టులో ఊరట లభించలేదు. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 22కు వాయిదా పడింది. మరి ఈ రోజు అయినా ఊరట లభిస్తుందా అన్న ఉత్కంఠ బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లోనెలకొంది.

    రేపటితో ముగియనున్న రిమాండ్‌..
    ఇదిలా ఉండగా కవిత జుడీషియల్‌ రిమాండ్‌ ఏప్రిల్‌ 23న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఉంది. ఈ నేపథ్యంలో రౌస్‌ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న టెన్షన్‌ గులాబీ శ్రేణుల్లో కనబడుతోంది. ఈరోజు బెయిల్‌ వస్తుందా.. మంగళవారం జుడీషియల్‌ రిమాండ్‌ను మళ్లీ పొడగిస్తుందా అని బీఆర్‌ఎస్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

    బెయిల్‌ను వ్యతిరేకిస్తున్న ఈడీ, సీబీఐ..
    ఇదిలా ఉంటే కవితకు బెయిల్‌ ఇవ్వడాన్ని ఈడీ, సీబీఐ వ్యతిరేకిస్తున్నాయి. మద్యం స్కాం కేసులో కవిత కీలకమని, ఆమెకు బెయిల్‌ ఇస్తే సాక్షాలు తారుమారు చేస్తారని పేర్కొంటున్నాయి. ఇప్పటికే డిజిటల్‌ ఎవిడెన్స్‌ను ధ్వంసం చేశారని ఆధారాలు చూపుతున్నాయి. సౌత్‌ గ్రూప్‌ కు చెందిన మరో నిందితుడు శరత్‌ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని కూడా ఆరోపించింది. విచారణ పూర్తయ్యే వరకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరుతున్నాయి. సీబీఐ కూడా తన విచారణకు కవిత సహకరించడం లేదని తెలిపింది.

    అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి..
    ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్‌చంద్రారెడ్డి నాలుగు రోజుల క్రితం అప్రూవర్‌గా మారడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో రౌస్‌ అవెన్యూ కోర్టు జడ్జి శరత్‌ స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శరత్‌ ఏం చెప్పారన్నది కూడా బెయిల్‌పై ప్రభావం చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్‌ కష్టమేనని న్యాయనిపుణుల విశ్లేషిస్తున్నారు. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందో చూడాలి.