Telangana Speaker: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. మూడో ప్రభుత్వం ఏర్పాటయింది. 2014, 2018లో వరుసా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టివిక్రమార్కతోపాటు పది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ క్రమంలో కొత్త సర్కారు సభాపతిగా ఎవరు ఉంటారన్న ఉత్కంఠ నెలకొంది. మొదట మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పేరు వినిపించింది. అయితే ఆయన అందుకు విముఖత చూపారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నాయకుడిని సభాపతిగా ఎంపిక చేయాలని అన్వేశించింది.
గడ్డం ప్రసాద్‌కుమార్ ఖరారు..
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరు ఖరారైంది. తాజా ఎన్నికల్లో ఈయన వికారాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో గడ్డం ప్రసాద్ కుమార్ టెక్సై్టల్ శాఖ మంత్రిగా పని చేశారు. ఈయన స్వగ్రామం వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం బెల్కటూర్. తాజాగా దళిత సామాజికవర్గానికి చెందిన, న్యాయవాది అయిన గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఎంపిక చేశారు.
సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత..
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్పీకర్‌గా ప్రసాద్‌కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రొటెం స్పీకర్ సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. తర్వాత
సభ్యులు అంతా కలిసి స్పీకర్‌గా ప్రసాద్‌కుమార్‌ను ఎన్నుకుంటారు.
రాజకీయ నేపథ్యంం..
ఇక ప్రసాద్ కుమార్ తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి. సంజీవరావుపై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌పై 4,859 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014 – 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ప్రసాద్‌కుమార్ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితురాలయ్యారు.