ఇంట్లో పనిచేస్తున్న మైనర్ బాలికపై ఆ ఇంటి ఓనర్ కొడుకు కన్నేశాడు. ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక అడ్డుకుందనే కోపంతో ఏకంగా ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ యజమాని మాత్రం మాట మార్చాడు. ఇంట్లో స్టవ్ మంటలు అంటుకున్నాయంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఖమ్మంలో ఈనెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 70 శాతం కాలిన గాయాలతో ఆ బాధితురాలు ఇన్ని రోజులు కోమాలో ఉంది. ఎట్టకేలకు సోమవారం స్పృహలోకి రావడంతో అసలు విషయం వెలుగు చూసింది.
Also Read: టీఆర్ఎస్ ఆ ఒక్క తప్పిదం.. ‘హస్తం’ అస్త్రమట?
ఓవైపు హథ్రాస్ లాంటి ఘటనలతో దేశం అట్టుడికిపోతుంటే.. మరోవైపు ఆ తరహా కీచక పర్వం కొనసాగుతూనే ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది ఖమ్మంలో జరిగిన ఈ దురాఘాతం.
ఖమ్మం రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఓ కూతురిని ఖమ్మం టౌన్ ముస్తఫానగర్‌లోని అల్లం సుబ్బారావు ఇంట్లో పనికి చేర్చింది. సుబ్బారావు కొడుకు మారయ్య (26) ఎప్పటి నుంచో ఆ బాలికపై కన్నేశాడు. ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. అందులో భాగంగా ఈనెల 18న తెల్లవారుజామున ఆ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె అడ్డుకోవడంతో మారయ్య కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు తట్టుకోలేక బాలిక అరవడంతో సుబ్బారావు, ఆయన కుటుంబ సభ్యులు టౌన్‌లో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు.
బాలిక శరీరం 70 శాతం కాలిపోయిందని డాక్టర్లు చెప్పారు.ఈ విషయం బయటకు తెలిస్తే తన కుమారుడికి శిక్ష పడుతుందని సుబ్బారావు ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌కు అబద్ధం చెప్పాడు. ప్రమాదవశాత్తు స్టవ్ ద్వారా మంటలు అంటుకున్నాయని నమ్మించాడు. రెండ్రోజుల తర్వాత బాలిక తల్లిదండ్రులకూ ఇదే విషయం చెప్పాడు. ఇన్ని రోజులు బాలిక కోమాలో ఉండడంతో అందరూ అదే నిజం అనుకున్నారు. సోమవారం స్పృహలోకి వచ్చిన ఆ బాలిక జరిగిన విషయాన్ని చెప్పడంతో అసలు సంగతి బయటపడింది.
Also Read: తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా.. ఏందీ ‘బాబూ’ ఇదీ?
అయితే.. ఈ విషయం బయటికి తెలియనీయొద్దని బాలిక తల్లిదండ్రులతో రూ.10 లక్షలకు సుబ్బారావు కుటుంబసభ్యులు బేరమాడారు. ఒప్పుకోవాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చారు. కానీ.. తమకు పరిహారం వద్దని.. న్యాయం కావాలని సోమవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో కేసు పెట్టారు. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.