Telangana MLC election : తెలంగాణలో ఖమ్మం–నల్గొండ–వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో సోమవారం(మే 27న) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉప ఎన్నికల్లో మొత్తం 49 మంది పోటీ పడ్డారు. కాంగ్రెస్ తరఫున చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున ప్రేమేందర్, బీఆర్‌ఎస్ తరఫున రాకేశ్‌రెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉంది.
53 శాతం పోలింగ్..
ఈ ఎన్నికల్లో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటుహక్కు కలిగి ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి 53 శాతం ఓటింగ్ నమోదైంది. క్యూలో కొంతమంది ఉన్నారు. ఎన్నికల సంఘం అధికారికంగా పోలింగ్ శాతం ప్రకటించాల్సి ఉంది.
బ్యాలెట్ పద్ధతిలో..
ప్రాధాన్య ఓటు పద్ధతి అయినందున ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించే అవకాశం లేదు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరిగింది. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అధికారి ఇచ్చిన వైలెట్ రంగు పెన్నుతో ప్రాధాన్యతను టిక్ చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎడమచేతి చూపుడు వేలిపై సిరా చుక్క పెట్టినందు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎడమ చేయి మధ్య వేలికి ఇంకు పెట్టారు. ఇక ఈ ఎన్నికల్లో నోటాకు ఓటు వేసే అవకాశం లేదు.
గట్టి బందోబస్తు..
ఉప ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్యం దుకాణాలు మైసివేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. సాయంత్రం 4 గంటల వరకు క్యూలో ఉన్నవారందరికీ ఓటువేసే అవకాశం కల్పించారు. జూర్ 5న పట్టభ6దులు కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడతారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాజీనామాతో..
ఈ పట్టభద్రుల స్థానానికి 2021, మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అబ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికల అనివార్యమైంది.
ఎడ్జ్ ఎవరికంటే..
ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎడ్జ్ ఎవరికన్న చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. అధికాక కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేతులు కలిపాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం తమదే అని బీఆర్‌ఎస్ ధీమాగా ఉంది. ఆరు నెలల్లో కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో అర్థమైందని, అందుకే పట్టభద్రులు బీఆర్‌ఎస్‌కు ఓటు వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ స్థానం కూడా బీఆర్‌ఎస్‌దే. మరి ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే జూన్ 5 వరకు ఆగాలి.