Ration Card Holders: మీకు తెల్ల రేషన్‌కార్డు ఉందా.. రేషన్ కార్డు(Ration Cards)పై ప్రస్తుతం పంపిణీ చేసే దొడ్డు బియ్యం తినలేకపోతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డుదారులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. వానాకాలం సన్న వడ్డకు ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లించి కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని మిల్లులకు తరలించి బియ్యం సేకరిస్తోంది. జనవరి నుంచే సన్నబియ్యం పంపిణీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అయితే అప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. దీంతో సన్న బియ్యం పంపిణీ వాయిదా వేసింది. మార్చి నుంచి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు పౌర సరఫనాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న 90 లక్షల తెల్ల రేషన్(White Ration Card)కార్డుతోపాటు కొత్తగా జారీ చేసే రేషన్ కార్డులపై మార్చి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈమేరకు 4.59 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సిద్ధం చేశారు. ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఉగాది నుంచి సన్నబియ్యం..
మార్చి నుంచి తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. ఈమేరకు బియ్యం సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సివిల్ సప్లయ్ అధికారులకు సూచించారు. అయితే ధాన్యం మరాడించడంలో జరుగుతున్న జాప్యంలో మార్చిలో బియ్యం పంపిణీ జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలుగువారి తొలి పండుగ నేపథ్యంలో అందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో సీఎం ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉంది. ఇక పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు ఈ క్రమంలో ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తారని సమాచారం.
కొత్త కార్డుల జారీ..
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ జరుగుతోంది. అర్హులకు కొత్త కార్డులు జారీ చేస్తున్నారు. మరోవైపు రేషన్‌కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది. దీంతో మీసేవ(Me Seva)కేంద్రాలకు నిత్యం జనం క్యూ కడుతున్నారు. ఈ ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దరఖాస్తులను పరిశీలించి చనిపోయినవారు, పెళ్లయి అత్తారింటికి వెళ్లినవారి పేర్లు తొలగిస్తోంది. కొత్తగా పెళ్లయివారితోపాటు, పిల్లల పేర్ల యాడ్ చేస్తోంది. వీరికి కూడా ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు ఇందిరమ్మ ఇళ్లు, రూ.500 సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిచేలా చర్యలు తీసుకుంటుంటున్నారు.