Nani trio in YSRCP
YSR Congress : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో త్రిమూర్తులు ఉన్నారు. ముగ్గురు ఒకేసారి మంత్రులుగా కూడా వ్యవహరించారు. ఒక వెలుగు వెలిగారు. అయితే ఎన్నికల అనంతరం తలో దిక్కు అయ్యారు. అందులో ఒకరు రీసెంట్ గా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. మిగతా ఇద్దరిలో ఒకరు కేసుల్లో చిక్కుకున్నారు. మరొకరు వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. ఇంతకీ ఎవరు ఆ త్రిమూర్తులు? అనుకుంటున్నారా? వారి కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని. ఈ ముగ్గురు వైసీపీలో త్రిమూర్తులుగా ఉండేవారు. కొందరు ముచ్చటగా నాని త్రయం అనేవారు. వైసిపి ఓడిపోవడంతో వీరి వైభవం కూడా పోయింది. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు మారిపోయారు.
* టిడిపిలో చేరిన ఆళ్ళ నాని
నిన్ననే తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో చేరారు మాజీ మంత్రి ఆళ్ల నాని( Alla Nani). కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా వ్యవహరించారు. 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో సైతం రెండోసారి గెలిచారు. జగన్ పిలుపుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ 2014లో ఓడిపోయారు. అయితే ఆళ్ల నానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు జగన్మోహన్ రెడ్డి. 2019లో ఎమ్మెల్యేగా గెలిచేసరికి క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో నాని ఓడిపోయేసరికి తెలుగుదేశం పార్టీ గూటికి చేరిపోయారు.
* కేసుల్లో చిక్కుకున్న పేర్ని నాని
మరో ఇద్దరు నానీల పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా పేర్ని నాని( perni Nani ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ప్రత్యర్థులపై విరుచుకు పడడంలో అందివేసిన చేయి. అయితే ఈ ఎన్నికల్లో తన బదులు కుమారుడు కిట్టును బరిలో దించారు. అయినా సరే ఓటమి ఎదురైంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేశారు. అక్కడికి కొద్ది రోజులకే రేషన్ బియ్యం దందాలో పట్టుబడింది ఆయన కుటుంబం. వరుస పెట్టి దీనిపై కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది కొద్ది రోజులు. ఇటీవల బయటకు వచ్చిన పెద్దగా యాక్టివ్ గా లేరు పేర్ని నాని.
* చడీ చప్పుడు లేని కొడాలి నాని
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani) చడీ చప్పుడు లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా సొంత నియోజకవర్గానికి దూరమయ్యారు. కనీసం చుట్టం చూపుగా కూడా గుడివాడ వైపు కనిపించడం లేదు. కోర్టు కేసుల నిమిత్తం వచ్చినా బయట ప్రపంచానికి అలికిడి లేదు. అటు అనుచరులు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సహచరుడు వల్లభనేని వంశీ మోహన్ ఇటీవల అరెస్టుకు గురయ్యారు. ఆయనపై వరుస పెట్టి కేసులు నమోదవుతున్నాయి. త్వరలో కొడాలి నానిని సైతం అరెస్టు చేస్తారని ప్రచారం నడుస్తోంది. ఇటువంటి తరుణంలో ఆయన ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే త్రిమూర్తులలో ఒక నాని తెలుగుదేశం పార్టీలో చేరితే.. మిగతా ఇద్దరు నానీలు బిజెపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి.