Gauthu Lachchanna Jayanti: దేశంలో ఇద్దరే సర్దార్లు. ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్( Sardar Vallabhbhai Patel). మరొకరు సర్దార్ గౌతు లచ్చన్న. పోరాటాలు, ఉద్యమాలకు చిరునామాగా ఉండేవారు గౌతు లచ్చన్న. ప్రజల కోసం ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉద్యమాలు చేపట్టారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. అలుపెరగకుండా శ్రమించారు. స్వాతంత్ర ఉద్యమానికి ముందు.. తరువాత గౌతు లచ్చన్న పాత్ర ఉమ్మడి రాష్ట్రంలో ఎనలేనిది. వెల కట్టలేనిది. ఆయన జన్మదినం ఈరోజు. 1909, ఆగస్టు 16న నాటి గంజాం జిల్లా బారువలో జన్మించారు గౌతు లచ్చన్న. తనదైన పోరాటాలతో సర్దార్ అనిపించుకున్నారు. బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం జీవితకాలం పోరాడారు. ఆయన జీవితమంతా ప్రజాపక్షమే. అధికారంలో ఉన్నా.. లేకున్నా అసలు సిసలు ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు సర్దార్ గౌతు లచ్చన్న. బడుగులు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు అందుకోవాల్సిన వారే అని లోకానికి చాటడమే కాదు.. పాలకుల కళ్ళు తెరిపించి అవి అమలయ్యేలా చేశారు గౌతు లచ్చన్న. ఈరోజు లచ్చన్న 117 వ జయంతి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు లచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Also Read: బట్టలిప్పేయ్.. రా సుఖ పెట్టు.. ఎస్సై విషయంలో ప్రభుత్వం ఏం చేసిందంటే..
బహుముఖ ప్రయాణం..
స్వాతంత్ర సమరయోధుడిగా, జమీందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా లచ్చన్న( gauthu Lachchanna) సాగించిన ప్రయాణం బహుముఖం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే విలక్షణ నేతగా గుర్తింపు సాధించారు. 35 సంవత్సరాల పాటు నిరంతరాయంగా చట్టసభలకు ఎన్నికయ్యారు. ఆయన కల్లు గీత కార్మిక కుటుంబం నుంచి వచ్చారు. అదే బలహీన వర్గాల గొంతుకగా మారారు. మెట్రిక్యులేషన్ చదువుతుండగా గాంధీజీ పిలుపుమేరకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. గాంధీజీ పిలుపుమేరకు హరిజన సేవా సంఘాలను ఏర్పాటు చేసి.. హరిజన రక్షణ యాత్రలు చేపట్టారు. అంటరానితనాన్ని దూరం చేసేందుకు హరిజనులకు ఆలయ ప్రవేశం చేయించారు. రాత్రిపూట బడులు నిర్వహించి బడుగు బలహీన వర్గాలకు విద్యను బోధించారు.
రైతాంగ పోరాటాలకు దిక్సూచి..
రైతాంగ పోరాటాలు చేయడంలో సర్దార్ గౌతు లచ్చన్న ముందుండేవారు. 1930లో శ్రీకాకుళం( Srikakulam) జిల్లా మందస నుంచి మద్రాసు వరకు రైతు చైతన్య కూలీ యాత్రను చేపట్టారు. ఆచార్య రంగా స్థాపించిన రైతాంగ విద్యాలయంలో చేరారు. అనేక జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు చేపట్టారు. 1935లో కాంగ్రెస్ సోషల్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1940లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. మూడేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. 1947లో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1950లో ఆచార్య ఎన్జీ రంగా కృషికర్ లోక్ పార్టీ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. 1953 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు.. మద్రాసు రాష్ట్రం నుంచి రావాల్సిన ఆస్తుల పంపకాలను పరిశీలించిన త్రి సభ్యుల్లో సర్దార్ గౌతు లచ్చన్న ఒకరు.
రాజకీయాల్లోనూ ముద్ర
ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సర్దార్ గౌతు లచ్చన్న పెను సంచలనం. 1953లో రాజాజీ ప్రకాశం పంతులు( Prakasam pantulu ) మంత్రివర్గంలో, బెజవాడ గోపాల్ రెడ్డి మంత్రివర్గంలో గౌతు లచ్చన్న మంత్రిగా పనిచేశారు. 1952 నుంచి సుదీర్ఘకాలం సోంపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 35 సంవత్సరాల పాటు క్రియాశీలక రాజకీయాలు చేసి.. తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు గౌతు శివాజీ. 1985 నుంచి 2004 వరకు సోంపేట నియోజకవర్గానికి వరుసగా ఐదు సార్లు గెలిచారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. సోంపేట నియోజకవర్గం కనుమరుగు కావడంతో 2009లో పలాస నుంచి పోటీ చేసి తొలిసారిగా ఓడిపోయారు. 2014లో రెండోసారి పోటీ చేసి గెలిచారు. 2019లో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొని తన కుమార్తె శిరీషకు ఆ బాధ్యతలు అప్పగించారు. 2019 ఎన్నికల్లో శిరీష పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మాత్రం ఆమె గెలిచారు.
Also Read: ఉచిత ప్రయాణం.. ఆటో డ్రైవర్ల పరిస్థితేంటి!?
చివరి వరకు జనంతోనే..
అయితే స్వాతంత్రోద్యమంలో అయినా.. రాజకీయాల్లో అయినా సర్దార్ గౌతు లచ్చన్నది దూకుడు స్వభావం. అంతకుమించి పోరాట తత్వం, అన్యాయాలను ఎండగట్టడం, అక్రమాలను తూలనాడడం లచ్చన్న నైజం. అందువల్లే ఆయన 35 ఏళ్ల పాటు నిరంతరాయంగా చట్టసభలకు ఎన్నికలు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలిసారిగా సీఎం అయిన ప్రకాశం పంతులు తనకు విలువైన సలహాలు సూచనలు అందించేందుకుగాను గౌతు లచ్చన్నను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే అంతకుముందు స్వాతంత్ర ఉద్యమం తో పాటు జమీందారీ పాలనపై అలుపెరగని పోరాటం చేసినందుకు గాను సర్దార్ గౌతు లచ్చన్నగా బిరుదు సొంతం చేసుకున్నారు. 1983 ఎన్నికల నుంచి క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కానీ ప్రజల మధ్య గడిపారు. ప్రజల కోసం పరితపిస్తూ 2006 ఏప్రిల్ 9న కన్నుమూశారు. ఆయన చనిపోయి 20 సంవత్సరాలు గడుస్తున్న ఆయన స్ఫూర్తి మాత్రం ఇంకా రగులుతూనే ఉంది. అటువంటి మహానీయుడి జయంతి వేడుకలను అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడం గర్వించదగ్గ విషయం.