Free Bus Travel: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. భారీ షాకిచ్చిన కాంగ్రెస్ సర్కార్

ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని ప్రకటించారు. అధికారం చేపట్టాక నిబంధనలు విధించారు. డిసెంబర్‌ 9 నుంచి అమలు చేస్తున్న ఉచిత ప్రయాణం కేవలం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులకే పరిమితం చేశారు.

Written By: Raj Shekar, Updated On : December 9, 2023 9:52 am

Free Bus Travel

Follow us on

Free Bus Travel: తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరు గ్యాంరెటీలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. సోనియాగాంధీ తుక్కుగూడ సభలో ఆరు గ్యారంటీలను ప్రకటించారు. బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత, ఆకర్షణీయంగా ఉన్న ఆరు గ్యారంటీలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చాయి. అయితే.. ప్రభుత్వం కొలువు దీరిన రెండు రోజులకే.. ఆరు గ్యారంటీల్లోని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు హామీ అమలుకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టింది. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఈ రెండు హామీలు అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని ప్రకటించి.. కండీషన్స్‌ అప్లయ్‌ అన్నట్లుగా నిబంధనలు విధించింది.

ఆ సర్వీసుల్లోనే..
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని ప్రకటించారు. అధికారం చేపట్టాక నిబంధనలు విధించారు. డిసెంబర్‌ 9 నుంచి అమలు చేస్తున్న ఉచిత ప్రయాణం కేవలం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులకే పరిమితం చేశారు. ఇక హైదరాబాద్‌లో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తామని తెలిపారు. సూపర్‌ లగ్జరీ, డీలక్స్, నాన్‌స్టాప్, ఇంద్ర, గరుడ లాంటి సర్వీసుల్లో ఉచిత ప్రయాణం ఉండదని స్పష్టం చేశారు.

ప్రయాణం పరిమితం..
పల్లె వెలుగు బస్సులు పరిమిత కిలోమీటర్లు మాత్రమే తిరుగుతాయి. అంటే.. ఉచిత ప్రయాణం పరిమితంగానే ఉంటుందన్నమాట. ఇక ఎక్స్‌ప్రెస్‌లలో చాలా వరకు నాన్‌స్టాప్‌ చేశారు. దీంతో ఈ బస్సుల్లో ఉచితం ఉంటుందా లేదా అన్నది స్పష్టత లేదు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఎక్కువగా డీలక్స్, ఇంద్ర, గరుడ లాంటి సర్వీసులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ బస్సుల్లో ఉచితం లేదు. దీంతో చార్జీలు చెల్లించాల్సిందే.

తెలంగాణ వరకే..
ఇక తెలంగాణ బస్సులు సరిహద్దున ఉన్న రాష్ట్రాలకు కూడా వెళ్తుంటాయి. కానీ ప్రభుత్వం తెలంగాణలో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ప్రకటించింది. రాష్ట్ర సరిహద్దు దాటితే టికెట్‌ తీసుకోవాల్సిందే. ఇక తెలంగాణకు వచ్చే ఇతర రాష్ట్ర బస్సుల్లో ఉచిత ప్రయాణం నిబంధన వర్తించదు.

ఇలా మహిళకు ఉచిత ప్రయాణం హామీని కండీషన్స్‌ మధ్య.. పరిమితంగా ప్రయాణించేలా ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అమలు చేయబోతోంది. దీనిపై మహిళల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.