Free Bus Travel
Free Bus Travel: తెలంగాణలో మహిళలు, బాలికలు, విద్యార్థినులు, హిజ్రాలూ (ట్రాన్స్‌జెండర్స్).. బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలు పెంచుతూ మరో పథకాన్ని కూడా ప్రారంభించారు. ఇవాళ సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వీటిని ప్రారంభించారు.
మహిళలకు ఇక ఫ్రీ జర్నీ..
తెలంగాణలో మహిళలు ఇకనుంచి సిటీ ఆర్టినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలలో ఒకటి. దీనికి వయసుతో సంబంధం లేదు. ఇందుకోసం మహిళలు మహాలక్ష్మి కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు కలిగి వుండాలి. ఐతే.. వారం పాటూ గుర్తింపు కార్డు లేకుండా కూడా ప్రయాణం సాగించవచ్చు. ఆ తర్వాత మాత్రం గుర్తింపు కార్డును దగ్గర ఉంచుకోవాలి. బస్సు ఎక్కిన ప్రతీసారీ కార్డును కండక్టర్‌కి చూపించాలి. అప్పుడు కండక్టర్ జీరో టికెట్ ఇస్తారు.
జీరో టికెట్ అంటే..
జీరో టికెట్ ఎలా ఉంటుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానిపై అమౌంట్ ఏదీ రాసి ఉండదు. దాన్ని ఉచితంగానే ఇస్తారు. అందులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారనే వివరాలు ఏవీ ఉండవు. తెలంగాణ సరిహద్దుల లోపల ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. సరిహద్దు దాటి ప్రయాణించాల్సి వస్తే.. ఆ ఎక్స్‌ట్రా దూరానికి మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో మొత్తం 7,929 బస్సుల్లో ఈ సౌకర్యం లభించనుంది.