https://oktelugu.com/

Auto Drivers: ఆడోళ్లకు ఉచిత బస్సులు.. ఆటోడ్రైవర్ల పరిస్థితేంటి?

కర్ణాటకలో అధికారంలోకి రావడంతో ఇక్కడ కూడా అదే పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి రావడంతో ఆ హామీని అమలు చేస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 12, 2023 / 02:29 PM IST

    Auto Drivers

    Follow us on

    Auto Drivers: మహాలక్ష్మి పథకం పేరుతో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది అమలవుతోంది కూడా. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీకి రోజుకు ఏడు కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది అని వినికిడి. మరి దీనిని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేస్తుంది అనేది ఆలోచించాలి. ఇప్పటివరకు మన దేశంలో మహిళలకు ఇలా ఉచిత ప్రయాణం కల్పిస్తున్న రాష్ట్రాలు ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక. అరవింద్ కేజ్రీవాల్ రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకు ఈ అవకాశాన్ని కల్పించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఆయన మార్గాన్ని అనుసరించాడు. అయితే తమిళనాడులో పింక్ బస్సుల పేరుతో ప్రత్యేకంగా మహిళల కోసం సర్వీసులు నడిపిస్తున్నారు. ఇక కర్ణాటకలోను కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు లో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది.

    కర్ణాటకలో అధికారంలోకి రావడంతో ఇక్కడ కూడా అదే పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి రావడంతో ఆ హామీని అమలు చేస్తోంది. ఈ పథకం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మీమ్స్ కు అయితే లెక్కేలేదు.. ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లడంతో పాటు, ఆటో డ్రైవర్లకు కూడా ఉపాధి లభించకుండా పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తావించారు. ఉచిత సర్వీస్ వల్ల ఆటో కార్మికులు ఉపాధి లేకుండా పోవడంతో రోడ్డున పడ్డారని, అలాంటి వారికి రేవంత్ రెడ్డి ఎలాంటి పరిష్కార మార్గం చూపిస్తారని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు.. అంతేకాదు తమ దీనావస్థ గురించి ఒక ఆటో డ్రైవర్ చెబుతుంటే.. దానిని ముఖ్యమంత్రికి ట్యాగ్ చేశారు. ఆటో డ్రైవర్ల గురించి కూడా ఆలోచించాలని ముఖ్యమంత్రి కి సూచించారు.. రాంగోపాల్ వర్మ ట్వీట్ చేసిన నేపథ్యంలో పలువురు స్పందించారు.

    ఆడవాళ్లకు ఉచిత ప్రయాణం కల్పించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా నష్టం వాటిల్లదని.. ఇంకా ఉచిత పథకాలు చాలానే ఉన్నాయని వాటిని రద్దు చేస్తే ప్రయోజనం ఉంటుందని సలహా ఇస్తున్నారు. రైతుబంధు పేరుతో భూస్వాములకు లక్షలకు లక్షలు ఇచ్చారని.. అలాంటి పథకంతో పోలిస్తే ఇది పెద్ద నష్టం చేకూర్చదని వారు అభిప్రాయపడుతున్నారు. మొన్నటిదాకా ఆటో డ్రైవర్లు మీటర్లు పెట్టి ప్రయాణికులను దోచుకున్నారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం వల్లే వారు మదన పడుతున్నారని మరి కొంతమంది వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన పథకం ద్వారా మహిళలకు లబ్ధి కలుగుతుందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. అయితే మెజారిటీ ప్రజల అభిప్రాయంతో ఏకీభవించకుండా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి అని రాంగోపాల్ వర్మ ప్రశ్నించడం.. ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభుత్వం వీరిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సి ఉంది.