Free Bus: ఉచిత బస్సు ఎఫెక్ట్ : సీటు దొరకలేదని డ్రైవర్ సీట్లో కూర్చున్న మహిళ

ఉచిత ప్రయాణ సౌకర్యం కారణంగా గ్రామాలకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో అయితే రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు ఎక్కుతున్నారు. ప్రతీ బస్సు 100 నుంచి 120 మందితో ప్రయాణిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : July 4, 2024 10:23 am

Free Bus

Follow us on

Free Bus: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలు ఆరు నెలలుగా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణం కారణంగా ఆర్టీసీ ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. కొంత మంది మహిళలు అవసరం లేకున్నా ప్రయాణం చేస్తున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చాలా మందికి బస్సుల్లో సీటు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులను క్రమంగా తగ్గిస్తోంది. డీలక్స్‌ బస్సులను పెంచుతోంది.

పల్లె వెలుగులో రెట్టింపు ప్రయాణికులు..
ఉచిత ప్రయాణ సౌకర్యం కారణంగా గ్రామాలకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో అయితే రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు ఎక్కుతున్నారు. ప్రతీ బస్సు 100 నుంచి 120 మందితో ప్రయాణిస్తోంది. దీంతో కూర్చోవడానికి సీట్లు దొరకడం లేదు. తాజాగా ఓ మహిళ బస్సులో సీటు దొరకకపోవడంతో ఏకంగా డ్రైవర్‌ సీటునే ఆక్రమించేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

బస్సు కోసం నిరీక్షించి..
ఒక మహిళ ఆర్టీసీ బస్సు కోసం బస్టాండ్‌లో ఎదురు చూసింది చాలాసేపు వేచి ఉన్న తర్వాత ఒక బస్సు వచ్చింది. అది ఎక్కి చూడగా బస్సులో అప్పగికే సీట్లకు సరిపడా ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఆమె బస్‌ దిగిపోయింది. మరో బస్‌ వచ్చే వరకు ఎదురు చూసింది. ఇంకో బస్సు రాగానే అది ఎక్కింది. అందులో కూడా ప్రయాణికులు ఫుల్లుగా ఉన్నారు. దీంతో సహనం కోల్పోయిన మహిళ ఏకంగా డ్రైవర్‌ సీటులో కూర్చొంది.

షాక్‌ అయిన డ్రైవర్‌..
బస్సు టైం కావడంతో డ్రైవర్‌ వచ్చాడు. తన సీటులో మహిళ కూర్చోవడం చూసి షాక్‌ అయ్యాడు. తన సీట్లో నుంచి లేవాలని కోరగా తనకు సీటు చూపిస్తే లేస్తానని వెల్లడించింది. దీంతో డ్రైవర్‌ మహిళ సీటులోంచి దిగితేనే బస్‌ కదులుతుందని చెప్పాడు. మిగతా ప్రయాణికులు ఆ మహిళకు సర్ది చెప్పారు. చివరకు ఆమె డ్రైవర్‌ సీటు నుంచి దిగిపోయింది. అనంతరం డ్రైవర్‌ బస్సు తీసుకెళ్లాడు.