Kapu Reservation: కాపులకు రిజర్వేషన్లు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపుల అంశం తెరపైకి వస్తుంది. కాపులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తుంటాయి. కాపులు మొగ్గు చూపిన పార్టీలే అధికారంలోకి వస్తుంటాయి.

Written By: Dharma, Updated On : July 4, 2024 10:14 am

Kapu Reservation

Follow us on

Kapu Reservation: ఏపీలో కాపులకు రిజర్వేషన్లు అంశం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా ఆ సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం పోరాడుతూనే ఉంది. తమను బలహీన వర్గాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూనే ఉంది. అయితే కాపులకు రిజర్వేషన్ ఫలాలు మాత్రం దక్కడం లేదు. ఎన్నో రకాల పోరాటాల ఫలితంగా 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం.. ఐదు శాతం ఈబీసీ రిజర్వేషన్లు ప్రకటించింది. కాపు కార్పొరేషన్ ఏర్పాటు విదేశీ విద్య దీవెన పేరిట.. ఇతర దేశాల్లో చదువుకునే కాపు విద్యార్థుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. అటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాయితీ రుణాలను సైతం అందించింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ రద్దయ్యాయి. ఈ బీసీ 5 శాతంతో కాపులకు ఎటువంటి ప్రయోజనం లేదని భావిస్తూ జగన్ రద్దు చేశారు. విదేశీ విద్యా దీవెన పథకాన్ని సైతం నిలిపివేశారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించలేదు. దీంతో గత ఐదు సంవత్సరాలుగాకాపులు ఇబ్బంది పడ్డారు.

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపుల అంశం తెరపైకి వస్తుంది. కాపులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తుంటాయి. కాపులు మొగ్గు చూపిన పార్టీలే అధికారంలోకి వస్తుంటాయి. అయితే ఈసారి కాపులు కూటమికి బలమైన మద్దతు దారులుగా నిలిచారు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండడంతో ఏకపక్షంగా ఓట్లు వేశారు. అందుకే కూటమి అంతులేని మెజారిటీతో విజయం సాధించింది. అధికారాన్ని చేపట్టింది. అందుకే కాపులు ఇప్పుడు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. వైసిపి ప్రభుత్వం నిలిపివేసిన పథకాలను పునరుద్ధరించాలని కోరుతున్నారు. రాయితీలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కూటమి అధికారంలోకి రావడంతో కాపు సంఘాలు యాక్టివ్ అయ్యాయి. కాపులకు చేపట్టాల్సిన అంశాలపై ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేస్తున్నాయి. మంత్రి కందుల దుర్గేష్ కు కొంతమంది కాపు సంఘం ప్రతినిధులు కలిసి కీలక ప్రతిపాదనలు విన్నవించారు. గతంలో చంద్రబాబు సర్కార్ అందించిన ఐదు శాతం ఈ బీసీ రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలని కోరారు. ఎంఎస్ఎమ్ఈ పథకం కింద పరిశ్రమల స్థాపన, రాయితీ రుణాలు అందించడం, విదేశాల్లో కాపు విద్యార్థులు చదువుకునే వీలుగా విద్యా దీవెన పథకాన్ని పునరుద్ధరించడం, కళాశాలకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు అందేలా ఆదేశాలు ఇవ్వడం వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూడాలని కోరారు. దీనిపై మంత్రి దుర్గేష్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే పవన్ కూటమిలో ఉండడం, కాపులు ప్రభుత్వం పై సానుకూలంగా ఉండడంతో.. కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు సర్కార్ అనుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.