
ఈ మధ్య కాలంలో రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా చాలామంది సైబర్ మోసాల బారిన పడుతున్నారు. మనం చేసే చిన్నచిన్న తప్పులే చాలా సందర్భాల్లో మనం సైబర్ మోసాల బారిన పడటానికి కారణమవుతున్నాయి. ఆన్ లైన్ లో మనం గడిపే సమయం, నిర్వహించే కార్యకలాపాలు, చూసే వెబ్ సైట్లు అన్నీ బ్రౌజింగ్ హిస్టరీలో ఉంటాయి.
సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే బ్రౌజింగ్ హిస్టరిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే మంచిది. తెలంగాణ పోలీసులు వ్యక్తిగత కంప్యూటర్, ల్యాప్ టాప్ కాకుండా ఇతరుల కంప్యూటర్, ల్యాప్ టాప్ లు వినియోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. అలా చేయడం ద్వారా డేటా, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు ఇతరులకు తెలిసే అవకాశం ఉండదని చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సైబర్ దాడులు, ఆన్‌లైన్ నేరాలు, మోసాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మోసాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజలకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆఫర్లు, క్యాష్ బ్యాక్ కూపన్లు, లోన్, జాబ్స్, మ్యాజిక్‌వీల్ పేరుతో సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ యూజర్లు అంతకంతకూ పెరుగుతుండగా సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.