Guvvala Balaraju Resigns: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు పంపించారు. ఇన్ని రోజులపాటు తనకు అవకాశం కల్పించినందుకు కేసిఆర్ కు బాలరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. కాలేశ్వరం, కవిత వ్యవహారం వంటి వాటితో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న కేసీఆర్ కు బాలరాజు పంపించిన లేఖ వ్యవహారం మరో కొత్త తలనొప్పి తీసుకొచ్చింది.
Also Read: శభాష్ సిరాజ్.. తండ్రి కష్టానికి గుర్తింపు తెచ్చావ్.. దేశాన్ని సగర్వంగా నిలబెట్టావ్!
బాలరాజు ఉద్యమ నాయకుడిగా కొనసాగాడు. అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ ఎపిసోడ్లో బాలరాజు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే లు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు ను భారతీయ జనతా పార్టీలో చేర్పించాలని.. కొంతమంది వ్యక్తుల ప్రయత్నించారని.. దీనికోసం డబ్బులు కూడా ఎరవేశారని అప్పట్లో భారత రాష్ట్ర సమితి గత్తరగత్తర చేసింది. సరిగ్గా మునుగోడు ఉప ఎన్నికల ముందు ఈ ఎపిసోడ్ ను తెరపైకి తెచ్చింది. పైగా ఆ ఎమ్మెల్యేలను ప్రగతిభవన్లోనే ఉంచుకున్నారు. వారికి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. చివరికి మునుగోడు ఉప ఎన్నికల ప్రచార సమయంలో వారిని ప్రజల ముందుకు తీసుకొచ్చాడు కేసీఆర్. వారిని తెలంగాణ హీరోలుగా అభివర్ణించాడు. ఈ పాచిక మునుగోడు ఉప ఎన్నికల వరకే పనిచేసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళింది. పైగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టింది.
మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. ఈ వ్యవహారాన్ని భారత రాష్ట్ర సమితి కావాలని పక్కన పెట్టింది. 2023 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోవడంతో.. అప్పటి ఫామ్హౌస్ ఎపిసోడ్ గురించి మాట్లాడే వారే కరువయ్యారు. ఇక ఫామ్ హౌస్ ఎపిసోడ్లో కీలకంగా ఉన్న గువ్వల బాలరాజు ఇప్పుడు కమలం పార్టీ కడువా కప్పుకోబోతున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి కూడా కమలం పార్టీలో చేరబోతున్నారు. అయితే రేగా కాంతారావు కమలం పార్టీలో చేరుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే నాటి ఫామ్ హౌస్ ఎపిసోడ్లో కీలకంగా ఉన్నవారిలో ఇప్పటికే ఇద్దరు కమలం పార్టీలో చేరబోతున్నారు. ఇది ఒక రకంగా భారత రాష్ట్ర సమితికి ఇబ్బందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేసీఆర్ కావాలని తన వ్యక్తులను భారతీయ జనతా పార్టీలోకి పంపిస్తున్నాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వీటి సంగతి ఎలా ఉన్నప్పటికీ. భారత రాష్ట్ర సమితి నుంచి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలా కీలక నాయకులు వెళ్లిపోవడం మాత్రం ఇబ్బందికరమైన పరిణామమే.