Kaleshwaram project : మొత్తం వారే చేశారు.. నాణ్యతను అస్సలు పట్టించుకోలేదు.. కాళేశ్వరం కమిషన్‌ ముందు నోరు విపుతున్న ఇంజినీర్లు!

తెలంగాణలో కాదు కాదు.. ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం అని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంది. రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టుతో కోటి ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని చెప్పుకుంది.

Written By: Raj Shekar, Updated On : August 23, 2024 8:36 am

Kaleshwaram project designs approve

Follow us on

Kaleshwaram project : కాళేశ్వరం ప్రాజెక్టు.. ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చే నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. కాళేశ్వరం అంటే కేసీఆర్‌ అన్నట్లుగా బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రచారం చేసుకున్నారు. లక్ష కోట్లతో బ్యారేజీలు నిర్మించి గోదావరి నీటిని చేలకు మళ్లించామని గొప్పగా చెప్పుకున్నారు. కొత్తగా కోటి ఎకరాలను సాగులోకి తెచ్చారని ప్రకటనలు ఇచ్చారు. ఏకంగా నేషనల్‌ జియోగ్రఫీ ఛానెల్‌లోనే డాక్యుమెంటరీ ప్రసారం చేసుకున్నారు. ఇంత గొప్పగా చెప్పుకున్న ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన మూడేళ్లకే పిల్లర్లు కుంగిపోయాయి. అన్నారం బ్యారేజీ వద్ద బుంగలు పడ్డాయి. సుందిళ్ల బ్యారేజీ కూడా ప్రమాదకరంగా మారింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు కీలక బ్యారేజీలలో ఇప్పుడు నీరు నిలపలేని పరిస్థితి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరంలో అక్రమాలపై విచారణకు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. దాదాపు మూడు నాలుగు నెలలుగా కమిషన్‌ విచారణ జరుపుతోంది. విచారణలో భాగంగా సుమారు 50 మందికి పైగా ఇంజినీర్లు, ఐఏఎస్‌ అధికారులు, కాంట్రాక్టర్ల నుంచి అఫిడవిట్లు తీసుకుంది. బుధవారం నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను ప్రారంభించింది. ఈ కమిషన్‌ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడే తప్పులు జరిగాయని.. ప్రభుత్వం , అధికారుల ఒత్తిడి వల్లనే ఇదంతా జరిగిందని మాజీ ఈఎన్సీ మురళీధర్‌ కమిషన్‌ ముందు ఒప్పుకున్నారు.

తొలిరోజు ఇద్దరు కీలక అధికారులు..
క్రాస్‌ ఎగ్జామినేషన్‌ తొలి రోజు బుధవారం(ఆగస్టు 21న) కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులు ఈఎన్‌సీ మురళీధర్, మాజీ ఈఎన్‌సీ నరేంద్రరెడ్డి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలోనే అనేక తప్పులు జరిగాయని కమిషన్‌ ముందు వీరిద్దరూ ఒప్పుకున్నారు. క్వాలిటీ ధ్రువీకరణలో లోపాలు, పనులు పూర్తికాకుండానే అయినట్లు సర్టిఫికెట్లు ఇవ్వడం, ఇంజినీర్లు చెప్పిన డిజైన్లలో మార్పుల..ఇందులో ప్రభుత్వ జోక్యం లాంటి విషయాలను మాజీ ఈఎన్సీలు కమిషన్‌ విచారణలో వెల్లడించారు. ఇంజినీర్లు తయారు చేసిన డిజైన్లకు ఆమోదం తెలిపేది ప్రభుత్వమేనని చెప్పారు ఈఎన్సీ మురళీధర్‌. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఈ ఆమోదాలుంటాయని చెప్పారు. ప్రాజెక్టులను 15 రోజులకొకసారి అయినా నాణ్యతా తనిఖీలు చేయాల్సి ఉండగా, కాళేశ్వరం విషయంలో ఇవేమీ జరగలేదని తెలిపారు.

వాళ్ల ఒత్తిడి మేరకే సంతకాలు..
ఇక కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగులను తాను మొదట అప్రూవ్‌ చేయలేదని కమిషన్‌ విచారణలో సీడీవో మాజీ ఈఎన్సీ నరేంద్రరెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు , ఉన్నతాధికారుల ఒత్తిడితో సంతకం చేశానని తెలిపారు. త్వరగా చేయాలన్న ఒత్తిడితో హడావుడిగా అన్నీ అప్రూవల్‌ చేశామన్నారు. మేడిగడ్డ ప్రతీ డిజైన్‌లో సీడీవోతోపాటు ఎల్‌అండ్‌టీ సంస్థ పాల్గొందని తెలిపారు. ఇదే ప్రెషర్‌ వలన క్వాలిటీ కంట్రోల్‌ను కూడా సరిగ్గా చేయలేదని అంగీకరించారు. బ్యారేజీ నిర్వహణ, గేట్ల ఆపరేషన్‌ సరిగా చేయలేదని చెప్పారు.