https://oktelugu.com/

Boinapally Vinod Kumar: అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదు!: బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని.. అందరూ భావించారు. కానీ ఈ పోటీ నుంచి భారత రాష్ట్ర సమితి తప్పుకుంది. దీంతో కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.

Written By: , Updated On : February 12, 2025 / 01:13 PM IST
Boinapally Vinod Kumar

Boinapally Vinod Kumar

Follow us on

Boinapally Vinod Kumar: భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు ఆ పార్టీ నేతలు ఇంతవరకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో.. దీనిని పక్కనపెట్టి.. “దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. కొడంగల్ లో మళ్లీ పోటీ చెయ్.. ఈసారి నువ్వు గెలిచే సీన్ లేదు.. నువ్వు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని” పదేపదే భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాళ్లు విసిరుతున్నారు. అంతేకాదు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని హెచ్చరిస్తున్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? అంత బలమైన పార్టీ ఎందుకు పోటీలో లేదు? అనే ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నారు. ” తెలంగాణలో బలమైన పార్టీ అని చెప్పుకున్నావు కదా.. 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని జబ్బలు చరిచావు కదా. ఇప్పుడేమైంది? ఎందుకు నువ్వు పోటీ చేయడం లేదు? పైగా రాజీనామా చేసి కొడంగల్ లో మళ్లీ పోటీ చేయ్ అని రేవంత్ రెడ్డికి సవాల్ ఎందుకు విసురుతున్నావ్” అంటూ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.

మాజీ ఎంపీ ఎంపీ అసలు విషయం చెప్పాడు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఎందుకు పోటీ చేయడం లేదో.. ఇంతవరకు ఆ పార్టీ నాయకులు చెప్పలేదు. కెసిఆర్ నుంచి మొదలుపెడితే కేటీఆర్ వరకు నిశ్శబ్దాన్ని మాత్రమే కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై తొలిసారిగా ఆ పార్టీ పార్లమెంట్ మాజీ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు. తమ పార్టీ ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదో ఒక స్పష్టత ఇచ్చారు…” అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. పార్లమెంటు ఎన్నికల్లోనూ అనుకున్న ఫలితాలు రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఓటర్లను నమోదు చేయించలేదు. ఉన్న విషయం ఉన్నట్లు చెప్పుకోవాలే. ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని” వినోద్ కుమార్ పేర్కొన్నారు.. దీనిని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం.. తెగ ప్రచారం చేస్తోంది.. “ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదు గాని.. ప్రభుత్వం కూలిపోతుంది.. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి.. కొడంగల్ లో మళ్లీ పోటీ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు.. కొడంగల్ లో పోటీ చేసి గెలిస్తేనే కదా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయింది.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఈ మాత్రం సోయి భారత రాష్ట్ర సమితి నాయకులకు తెలియకపోవడం బాధాకరమని” కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.