Voter Registration: ఓటరు నమోదుకు.. మరో అవకాశం.. మార్పులు, చేర్పులకు కూడా… ఎప్పటి నుంచంటే..

ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుద్ధం. పాలకులను ఎన్నుకునే ఆయుధం.. నచ్చనివారిని కూల్చే అస్త్రం కూడా. అందుకే దీనికి ఎన్నికల్లో అత్యంత విలువ ఉంటుంది.

Written By: Raj Shekar, Updated On : August 19, 2024 5:17 pm

Voter Registration

Follow us on

Voter Registration: ఓటు ప్రజాస్వామ్యంలో చాలా కీలకం. తమ పాలకులను ప్రజలు ఎన్నుకునే అస్త్రం. నచ్చనివారిని పదవి నుంచి దించే ఆయధం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం. మన దేశంలో రాజ్యాంగ ప్రతీ పౌరుడికి ఓటుహక్కు కల్పించింది. 18 ఏళ్లు నిండిన అందరి పేర్లను ఎన్నికల సంఘం ఓటరు జాబితాలో నమోదు చేస్తుంది. చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ఇందుకోసం ఏటా నాలుగుసార్లు ఓటరు నమోదు చేపడుతోంది. తాజాగా 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే పౌరులంతా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇందులో భాగంగా ఓటర్ల నమోదు కోసం తాజాగా మరో అవకాశం కల్పిస్తోంది. జిల్లాలోని బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఈనెల 20 నుంచి తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సవరించనున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఓటరు నమోదుపై యంత్రాంగం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడితే మరింత మంది యువత ఓటు హక్కు పొందేందుకు అవకాశముంటుంది.

రేపటి నుంచి ఇంటింటి సందర్శన
ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బీఎల్‌వోలు ఆగస్టు 20 నుంచి తమ పరిధిలోని ఇంటింటి సందర్శన చేపట్టనున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు 18 ఏళ్లు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేస్తారు. మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను జాబితా నుంచి తొలగించనున్నారు. అలాగే ఓటర్లకు సంబంధించిన ఏదైనా సమాచారం తప్పుగా ఉన్నా, చిరునామాలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్నా ఆ దిశగా తగు చర్యలు చేపడుతారు. జాబితాలో ఫొటో లేనట్లయితే దానిని సేకరించి మార్పులు చేస్తారు. పోలింగ్‌ కేంద్రాలను సైతం మార్చుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ ప్రక్రియ అక్టోబర్‌ 18వ వరకు సంబంధిత మండలాల రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో కొనసాగనుంది. ఇందులో సేకరించిన వివరాల ప్రకారం అక్టోబర్‌ 28వరకు తగు మార్పులు, చేర్పులతో పాటు వివరాలు సరిచేసి 29న ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. నవంబర్‌ 28వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. వాటిని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించిన శని, ఆదివారాల్లో చర్యలు చేపట్టనున్నారు.

అవగాహన కల్పిస్తే ప్రయోజనం
ఇప్పటికే పంచాయతీ ఎన్నికల కసరత్తు షురూ కాగా త్వరలోనే ఎన్నికల నగారా మోగే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల అనంతరం మండల, జిల్లా పరిషత్‌ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. ఇలా వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో యువత ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ దిశగా వారిలో అవగాహన కల్పించేలా యంత్రాంగం తగు చర్యలు చేపట్టినట్లయితే కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందనే అభిప్రాయం రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతుంది. ఆ దిశగా యంత్రాంగం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని డిగ్రీ, బీఎడ్, డీఎడ్‌ వంటి కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి యువతను చైతన్యవంతులను చేస్తే వారు ఓటు హక్కు పొందనున్నారు.

నిర్దేశిత ఫారాలు ఇలా..
ఫారం – 6 : కొత్తగా ఓటరుగా నమోదు కోసం
ఫారం – 6బి : ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం
ఫారం – 7 : జాబితా నుంచి పేర్ల తొలగింపునకు
ఫారం – 8 : జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు.