Food Poisoning: తెలంగాణలోని గురుకులాల మెస్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పెంచింది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందని భావించింది. కానీ, ధరలు పెంచిన నాటి నుంచే రాష్ట్రంలో ఫుడ్‌పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అధికారుల తనిఖీల్లో నాసిరకం సరుకులు నాణ్యత లేని భోజనం వెలుగు చూశాయి. తాజాగా నారాయణపేట జిల్లా మాగనూర్‌లో వారం వ్యవధిలో రెండుసార్లు విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. వరుస ఘటనలతో హైకోర్టు విచారణ జరిపింది. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించింది. విద్యార్థుల ప్రాణాలు పోయాక స్పందిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం కూడా స్పందించింది. పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీకమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కమిటీ సభ్యులు రుచి చూశాకే పిల్లలకు భోజనం పెట్టాలని ఆదేశించింది. మరోవైపు కోర్టు కూడా అన్ని పాఠశాలల నుంచి మధ్యాహ్న భోజనం నమూనాలు సేకరించాలని ఆదేశించింది.
కురుకే కారణంగానే..
ఇక మాగనూర్ గురుకులంలో వారం వ్యవధిలో రెండుసార్లు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టళ్లలో ఉంటే.. మంచిచదువు, భోజనం అందుతాయని పేద విద్యార్థులను తల్లిదండ్రులు హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. కానీ, ఇలాంటి ఘటనలతో ఆందోళన చెందుతున్నారు. అయితే మాగనూర్‌లో తాజాగా ఫుడ్ పాయిజన్‌కు కుర్‌కునే కారణమని ప్రభుత్వం నిర్ధారించింది. ఈమేరకు కోర్టుకు నివేదిక ఇచ్చింది. విద్యార్థులు కుర్‌కురే తినడం కారణంగానే అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. బాధ్యులపై చర్య తీసుకున్నామని వెల్లడించింది. కాగా బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని మాగనూర్‌తోపాటు కరీంనగర్, బురుగుపల్లి ఘటనలపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
కలెక్టర్లకు సీఎం ఆదేశాలు..
ఇదిలా ఉంటే.. పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కమిటీ రుచి చూసిన తర్వాతనే విద్యార్థులకు భోజనం పెట్టాలన్నారు.