Telangana Politics : నీట మునిగిన ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సందర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు మంగళవారం భారత రాష్ట్ర సమితి నాయకులు, మాజీమంత్రులు ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ముంపు ప్రాంతాలలో ప్రజలను పరామర్శించారు. మున్నేరు వరదను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బాధితులను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శిస్తున్న క్రమంలో.. ఆయన వాహనంపై కొంతమంది వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో భారత రాష్ట్ర సమితి నేతలు గాయపడ్డారు. ఇందులో ఒకరికి కాలు విరిగింది. అతడిని పువ్వడ అజయ్ కుమార్ పరామర్శించారు. ఈ ఘటన మంచి కంటి నగర్ లో చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత రాష్ట్ర సమితి నేతలపై జరిగిన దాడిని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తప్పు పట్టారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దారుణమన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు..
అసహనం పెరిగిపోయింది
పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం వారిలో పేరుకుపోయిన అసహనానికి నిదర్శనమని కేటీఆర్ ఆరోపించారు.”కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు సేవ చేయడం చేతకావడం లేదు. సాయం చేస్తున్న నేతలను చూసి ఓర్వలేక పోతున్నారు. అందువల్లే దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేసింది. అందువల్లే వారికి మేము అండగా ఉంటున్నాం. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఇది మా తప్పా? ఇలాంటి దాడులు చేయడం సిగ్గుచేటు. ఈ ఘటనకు ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యత తీసుకోవాలి. మాపై ఎన్ని దాడులు చేసినా సరే ప్రజలకు అండగా ఉంటాం. ప్రజల వద్దకు వెళుతూనే ఉంటాం. మమ్మల్ని ఎవరూ ఆపలేరు. కాంగ్రెస్ పార్టీకి చేతకావడం లేదు. దద్దమ్మ పాలన సాగిస్తోంది. ప్రజల మొత్తం గమనిస్తున్నారు. కచ్చితంగా వారికి సరైన సమయంలో బుద్ధి చెబుతారని” కేటీఆర్ హెచ్చరించారు.
దాడి చేసింది మేము కాదు
మరోవైపు మాజీ మంత్రులపై దాడులు చేసింది తాము కాదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. భారత రాష్ట్ర సమితి నాయకులు బురద రాజకీయం చేస్తున్నారని.. ఇలాంటి సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని వారు అంటున్నారు. చరిత్రలో కనివిని ఎరుగని స్థాయిలో వరద వచ్చిందని.. అయినప్పటికీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనిచేస్తోందని వారు వివరించారు. ప్రభుత్వంపై చరకబారు విమర్శలు చేస్తే.. వాటికి సరైన స్థాయిలో సమాధానం చెబుతామని వారు పేర్కొంటున్నారు.