Pawan Kalyan – Mahesh Babu : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వరదలు సృష్టిస్తున్న బీభత్సం ని మనం గత వారం రోజులుగా చూస్తూనే ఉన్నాం. విజయవాడ ప్రాంతం మొత్తం నీటిలో మునిగిపోయింది. ఎంతోమంది అమాయకులు ఈ వరదలో కొట్టుకొనిపోయి ప్రాణాలను వదిలారు. రోడ్ల మీద పారుతున్న నీటిలో విష సర్పాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వరద ప్రాణనష్టంతో పాటుగా ఆస్తి నష్టం కూడా చేసింది. ఇలాంటి కష్టమైన సమయం లో సీఎం చంద్రబాబు నేరుగా వరద పీడిత ప్రాంతాలకు వెళ్లి అధికారులతో పని చేయిస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ వరద పీడిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అయితే రెండు ప్రభుత్వాలకు అండగా మన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా నిలిచారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తన వంతు సహాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల రూపాయిలు డొనేట్ చేయగా, ఆ తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ 5 లక్షలు, అలాగే హీరోయిన్ అనన్య నాగేళ్ల 2 లక్షల 50 వేల రూపాయిలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. కాసేపటి క్రితమే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తనవంతు సాయంగా కోటి రూపాయిల ఆర్ధిక సహాయంగా అందించగా, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి చెరో 50 లక్షల రూపాయిలు అందించారు. సరైన సమయంలో మన టాలీవుడ్ హీరోలు ఇలా వరద బీభత్సం కి స్పందించి తమవంతుగా ఆర్ధికసాయం చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. మన స్టార్ హీరోలను అభిమానులు దేవుళ్ళు లాగ కొలుస్తుంటారు, తమ సొంత ఇంట్లో వాళ్ళుగా అభిమానులు భావిస్తూ ఉంటారు. వారికోసం ఎన్నో పోరాటాలు చేస్తుంటారు, సేవాకార్యక్రమాలు కూడా చేస్తుంటారు.
అలాంటి అభిమానులు , ప్రేక్షకులు కోసం హీరోలు ఇలా అండగా నిలబడడాన్ని చూస్తుంటే వాళ్ళ మనసు ఎంత గొప్పది అనేది అర్థం అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ కేవలం సినీ హీరో మాత్రమే కాదు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా. నిన్న ఆయన పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఎంత ఘనంగా జరుపుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన సూపర్ హిట్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసి, అల్ టైం ఇండియా రికార్డు పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వరద పీడిత ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందించేందుకు ఒక ఉపముఖ్యమంత్రి గా ఎలాంటి బాధ్యతలు చేపట్టాలో, అలాంటి బాధ్యతలు చేపట్టాడు. అయితే సీఎం చంద్రబాబు లాగా, పవన్ కళ్యాణ్ కూడా వరద ప్రాంతాల్లోకి వస్తే బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయం పడ్డారు. దీనికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘నేను అక్కడికి వస్తే రిస్క్యూ ఆపరేషన్స్ కి భంగం కలుగుతుందని అధికారులు చెప్పారు, అందుకు ఆగాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.