BRS Party Office In Manuguru: తెలంగాణలో అధికార కాంగ్రెస్–విపక్ష బీఆర్‌ఎస్ మద్య రాజకీయ మంటలు ఆగడం లేదు. ఇరు పార్టీల నేతలు రాజకీయాలు ఎన్నికల వరకే అని సుద్దపూజ ముచ్చట్లు చెబుతున్నారు. కానీ.. ఎన్నికలు ముగిసి రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అధికార పార్టీ ఏం చేసినా.. ప్రతిపక్షంగా విమర్శించాలి కాబట్టి.. బీఆర్‌ఎస్ ప్రతీ పనిని విమర్శిస్తోంది. ఇక తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ మాటలు మంటలు చేపుతున్నాయి. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. కార్యాలయంలోని సామగ్రి ధ్వంసం చేసి, ఫర్నీచర్‌కు నిప్పు పెట్టారు.
మంటలు రేపిన ఆగ్రహం..
2018లో మణుగూరి నుంచి రేగా కాంతారావు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికారపార్టీగా ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్‌ఎస్ కేంద్రంగా మార్చడం ఆగ్రహానికి కారణమైంది. స్థలాన్ని ప్రత్యక్షంగా పార్టీ కార్యకర్త ఒకరు విరాళంగా ఇచ్చారని, భవన నిర్మాణం కూడా ఆయన కృషితోనే జరిగిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థలం తమ హక్కు అన్న భావన కాంగ్రెస్ శ్రేణుల్లో ఆవేశాన్ని పెంచింది.
అధికారం అండతో..
ఇంతకాలం బీఆర్‌ఎస్ అధికారంలో ఉండడంతో మౌనంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏళ్లుగా రగులుతున్న అసంతృప్తి జ్వాల ఇప్పుడు బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని దహించివేసింది. రేగా కాంతారావు ఎన్నికల్లో ఓటమి చవిచూడటం స్థానిక నేతల్లో ధైర్యం నింపింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్ జెండాలను తొలగించి, కార్యాలయ సామగ్రిని రోడ్డుపై పడేశారు. అనంతరం వాటికి నిప్పు పెట్టారు. బీఆర్‌ఎస్ నాయకులు ఘటనాస్థలానికి చేరుకోవడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరుపక్షాల వారిని అడ్డుకున్నారు.
బీఆర్‌ఎస్ కార్యాలయ స్థల సమస్యతోపాటు, రేగా కాంతారావు బీఆర్‌ఎస్ అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకున్నారనే ఆరోపణలు మరోసారి ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయనపై మణుగూరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే నివురుగప్పిన నిప్పు ఇప్పుడు మంటలుగా మారి.. బీఆర్‌ఎస్ కార్యాలయ ఫర్నిచర్ దహించివేసింది.