Faults In RTC Buses: కర్నూలులో వేమూరి ట్రావెల్స్ సంస్థకు సంబంధించిన బస్సు అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది దాకా చనిపోయారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తెలంగాణ ఆర్టిఏ విస్తృతంగా తనిఖీచేస్తోంది. లోపాలు ఉన్న బస్సులను పక్కన పెడుతోంది. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల నిర్వాహకులపై కేసులు కూడా నమోదు చేస్తోంది.
ప్రవేట్ సంస్థలు మాత్రమే కాదు.. ప్రజా రవాణా సంస్థగా పేరుపొందిన ఆర్టీసీలు కూడా పరిస్థితులు అలానే ఉన్నాయి. కర్నూలు ప్రమాదం తర్వాత ఆర్టీసీ సంస్థ పై ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో వివరాలు చూస్తే నిజంగానే దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి.. హైదరాబాద్ నగర పరిధిలోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో కనీసం దూర ప్రాంత డ్రైవర్లకు విశ్రాంతి తీసుకోవడానికి మంచాలు కూడా లేవట. దీంతో వారు కిందనే పడుకోవాల్సిన పరిస్థితి. పైగా డ్రైవర్లకు నిద్ర కూడా సరిగ్గా ఉండడం లేదట. నైట్ హాల్ట్ సర్వీసులో వెళ్లే వారికి నిద్రపోవడానికి తగినంత సమయం.. ఇతర సౌకర్యాలు కూడా ఉండడం లేదట.
రాత్రిపూట బస్సులను నడిపే డ్రైవర్లు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటలకు స్టీరింగ్ పడితే రాత్రి 10 గంటలకు డ్యూటీ ముగుస్తుందట. ఈ ప్రకారంగా చూసుకుంటే ఏకధాటిగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు డ్రైవర్లు బస్సులు నడపాసి వస్తుందట. గమ్యం చేరిన తర్వాత చాలా ప్రాంతాలలో కనీస సదుపాయాలు లేవట. కొన్నిసార్లు రోడ్డు పక్కనే బస్సులు ఆపుకొని అందులో ఉన్న సీట్లపై డ్రైవర్లు నిద్రిస్తున్నరట. ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేస్తున్న గదులు చిన్నవిగా ఉండడంతో డ్రైవర్లకు అవి సరిపోవడం లేదట. పైగా ఆ రూములలో పడకలు లేకపోవడంతో కటిక నేల మీదనే నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
భోజనం చేసిన తర్వాత నిద్రపోయేసరికి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు అవుతోందట. రూట్ ఆధారంగా తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాల నుంచి నాలుగు గంటల మధ్యలో నిద్ర లేచి నాలుగు గంటల 30 నిమిషాల వరకు మళ్ళీ స్టీరింగ్ పట్టుకోవాల్సి వస్తుందట. ఈ ప్రకారం డ్రైవర్లకు నిద్రపోవడానికి కేవలం 5 గంటల వరకే సమయం ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఎటువంటి పొరపాటు జరిగిన సరే అది భారీ ప్రమాదానికి కారణం అవుతుంది.
హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇతర నగరాలకు ప్రైవేటు ఆపరేటర్లు నడిపించే బస్సుల్లో కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటున్నప్పటికీ… వారికి తగిన స్థాయిలో విశ్రాంతి ఉండడం లేదు. కొన్ని సందర్భాలలో ప్రవేటు బస్సు ఆపరేటర్లు రెండో డ్రైవర్ పడుకునే బెర్త్ కూడా అమ్ముకుంటున్నారు. దీంతో రెండవ డ్రైవర్ కూడా కంటిమీద కునుకు లేకుండానే ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
హైదరాబాదులోని ఉప్పల్ ప్రాంతంలో నైట్ హాల్ట్ చేసే బస్సులు డ్రైవర్లకు ఏమాత్రం సౌకర్యాలు లేవు. వరంగల్ రెండో డిపోలో 19 బస్సులు ఉన్నాయి. తొర్రూరు డిపోలో 18 బస్సులు ఉండగా.. ఇవన్నీ కూడా రోడ్డు పక్కనే హాల్ట్ అవుతున్నాయి. దీంతో బస్సుల్లోనే డ్రైవర్లు నిద్రపోతున్నారు. చివరికి సులబ్ కాంప్లెక్స్ లలో కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. రాత్రి 11 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటే.. నిద్రపోయేసరికి 11:30 దాటుతోంది. మళ్లీ తెల్లవారుజామున 4:00 కల్లా లేవాల్సి వస్తోంది. కొన్ని బస్సులు అయితే మూడు గంటలకే మొదలు కావడం అత్యంత విషాదం. ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని దారుణాలు చాలానే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నచోట ప్రజా రవాణా ఎలా భద్రం? ప్రయాణికుల ప్రాణాలు ఎలా సురక్షితం?