మాజీ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి లేఖతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాంతో విచారణ చేపట్టిన అధికారులు ఈ కేసులో కుంభకోణం జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిర్ధారించారు. రూ.1000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం ఆరోపిస్తోంది. దాంతో ఏ 5గా సోమేష్ కుమార్‌ను చేరుస్తూ కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటున్నట్లు తెలిసింది. సోమేష్ కుమార్‌కు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సోమేష్‌తోపాటు మరికొందరు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ ఎ.శివరాం ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీలు కంపెనీలు ఉన్నాయి.
వస్తువులు సరఫరా చేయకున్నా చేసినట్లు.. ఫేక్ ఇన్వాయిసులు సృష్టించినట్లు.. వాటికి రిటర్న్స్ క్లెయిమ్ చేసినట్లుగా వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారందరిపై కేసులు నమోదయ్యాయి. అయితే.. తప్పుడు ఇన్వాయిస్‌లతో రాష్ట్రానికి రావాల్సిన రూ.1,400 కోట్ల ఆదాయాన్ని పక్కదారి పట్టించారని, ఇందులో సోమేష్ కుమార్ కీలకం అని సీఐడీ గుర్తించింది. అందుకే.. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయిపోయినట్లుగా సమాచారం అందుతోంది.
అయితే.. దీనిపై ఇప్పుడు రాజకీయంగానూ చర్చ జరుగుతోంది. కెసిఆర్‌కు నమ్మిన బంటుగా ఉన్న సోమేష్ కుమార్.. ఆయనకు తెలియకుండానే ఇంతటి అవకతవకలకు పాల్పడ్డారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందా..? కెసిఆర్ ఆర్డర్ లేనిదే ఏ ఫైల్ కానీ, ఏ జీవో కానీ పాస్ కాదని అందరికీ తెలిసిందే. పాలన అంతా కూడా కెసిఆర్ కనుసన్నలోనే జరిగేదనేది బహిరంగ వాస్తవం. అయితే.. జీఎస్టీ విభాగంలో ఇంత పెద్ద అవినీతి జరుగుతున్నా కెసిఆర్‌కు తెలియకుండా ఉంటుందా అని ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న. అటు మరో వాదన సైతం తెరమీదకు వస్తోంది. కెసిఆర్ కోసమే సోమేష్ కుమార్ ఇలా చేశారని, అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్‌కు సాయం చేసి ఇప్పుడు సోమేష్ కుమార్ ఇరుక్కుపోయారనే ప్రచారం సైతం జరుగుతోంది.