Etela Rajender: నన్ను కాంగ్రెస్ లోకి రావాలన్నారు.. కానీ? అసలు నిజం బయటపెట్టిన ఈటెల రాజేందర్

ఈటెల రాజేందర్ బిజెపిలో కీలక స్థానంలో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తదుపరిగా ఆయన అడుగులు పార్లమెంటు స్థానం వైపే అని రాజేందర్ అనుచరులు అంటున్నారు.

Written By: Suresh, Updated On : December 29, 2023 1:38 pm

Etela Rajender

Follow us on

Etela Rajender: రాజకీయాలు చేసేది ప్రజాసేవ కోసం అనుకుంటే పోరాబాటే. అధికారంలో ఉన్నవారు అభివృద్ధి చేస్తామని చెబుతారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని చెబుతారు. కానీ ఇవేవీ నిజాలు కాదు. ఒకవేళ అవే గనుక నిజాలై వుంటే మన దేశం, మన రాష్ట్రం నేటికీ అభివృద్ధి చెందుతున్న జాబితాలో ఉండేవి కావు. ఒకవేళ నాయకులకు గనుక ఆ చిత్తశుద్ధి ఉండి ఉంటే మన దేశం ఎప్పుడో ప్రపంచాన్ని శాసిస్తూ ఉండేది. సరే అది పెద్ద సబ్జెక్టు కాబట్టి లోతుల్లోకి వెళ్లడం లేదు. కానీ రాజకీయాలన్నాక ముఖ్యంగా మనదేశంలో పొత్తులు, అటు నుంచి ఇటు పోవడాలు, ఇటునుంచి అటు వెళ్లడాలు జరుగుతుంటాయి. మొదట్లో అంటే దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తొలినాళ్లల్లో రాజకీయాలు నీతివంతంగానే ఉన్నాయి. ప్రజల సేవ కోసం నాయకులు నడుం బిగించి పనిచేసేవారు. క్రమేపి డబ్బు సంపాదన అనివార్యం కావడం, రాజకీయాల్లోకి వ్యాపారులు ప్రవేశించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.. ఫలితంగా డబ్బు సంపాదన కోసమే రాజకీయాల్లోకి రావడం రివాజుగా మారింది. ఇక ఇందులో నీతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ముందుగానే మనం చెప్పుకున్నట్టు రాజకీయాల్లో అవసరార్థ పొత్తులు ఉంటాయి. అవసరార్థ చేరికలుంటాయి. ఆ చేరికల వల్ల జరిగే ప్రయోజనం ఆధారంగానే తదుపరి అడుగులు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈటెల రాజేందర్ పేరు ఒకప్పుడు మారుమోగుతూ ఉండేది. కెసిఆర్ తర్వాత ఆయన పేరే ప్రముఖంగా వినిపించేది. రాజేందర్ తర్వాతనే కేటీఆర్, హరీష్ రావు వంటి వారు ఉండేవారు. ఎప్పుడైతే గులాబీ జెండాకు మేమే ఓనర్లం అని చెప్పాడో.. ఆయన అప్పుడే బలవంతంగా బయటికి గెంటి వేయబడ్డాడు. అంతేకాదు భూములు లాక్కున్న మంత్రిగా పేరుగడించాడు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఆరోపణలు భారత రాష్ట్ర సమితి నుంచి ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఆయన బిజెపిలోకి వెళ్లడం.. హుజరాబాద్ నియోజకవర్గం.. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం వంటివి జరిగిపోయాయి. కానీ బిజెపిలోకి ఆయన వెళ్లిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ఈటల రాజేందర్ ను వార్తల్లో వ్యక్తిని చేశాయి.. ఆయన వల్లే బిజెపిలో కంపట్లు రగిలాయని, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి పోవడానికి రాజేందరే ప్రధాన కారణమని రకరకాల ఆరోపణలు వినవచ్చాయి. రాజకీయాలన్నాక ఇవన్నీ సహజమే కానీ.. ప్రస్తుతం జరుగుతున్న చర్చ మరో విధంగా ఉంది.

ఈటెల రాజేందర్ బిజెపిలో కీలక స్థానంలో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తదుపరిగా ఆయన అడుగులు పార్లమెంటు స్థానం వైపే అని రాజేందర్ అనుచరులు అంటున్నారు. అయితే ఆయన మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ పార్టీ నాయకులు రాజేందర్ ను సంప్రదించారట. కాంగ్రెస్ పార్టీలో చేరితే మంచి ఆఫర్ ఇస్తామని కూడా ఆశపెట్టారట. అయితే అప్పట్లో ఇదే విషయాన్ని రాజేందర్ భారతీయ జనతా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. అయితే అధిష్టానం ఏం చెప్పిందో తెలియదు గానీ రాజేందర్ మాత్రం బిజెపిలోనే ఉండిపోయారు. ప్రస్తుతం ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజేందర్ కాంగ్రెస్ లో చేరుతారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆయన అన్న మాటలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే రాజేందర్ కాంగ్రెస్ లోకి వెళ్తారా? బిజెపి లోనే ఉండి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.